హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో విజయం సాధించడంతో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా, ఇంగ్లాండ్‌పై వరుసగా మూడు సిరిస్‌లను సొంతం చేసుకున్న అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.
బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 75 పరుగులతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయానంతరం టీమిండియా క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు. ధోని నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
'ఏమి విజయం ఇది. యువరాజ్ సింగ్, ధోని, అశు భాయ్.. సహచరులందరికి నా అభినందనలు' అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని, యువరాజ్‌సింగ్, ఆశిష్ నెహ్రాతో కలిసి దిగిన సెల్ఫీని కెప్టెన్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా టెస్టు, వన్డే, టీ20 సిరిస్‌లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తన జట్టులో వెటరన్ ఆటగాళ్లు ఉండటం వల్ల కఠిన పరిస్థితుల్లో వారి సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు బీసీసీఐ 'ఛాంపియన్స్' అని రాసి భారత జట్టు సభ్యులందరూ కలిసి దిగిన సెల్ఫీని తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు భారత కోచ్ అనిల్ కుంబ్లే సైతం సోషల్ మీడియాలో స్పందించారు. 'మూడు ఫార్మాట్లలో సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియాకు అభినందనలు. ఆల్‌రౌండ్ ప్రదర్శన అద్భుతమని' కుంబ్లే అందులో తెలిపాడు.