న్యూఢిల్లీ: జూన్ 19 (ఆదివారం) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా భావోద్వేగంతో నిండిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. తన చిన్నతనంలో తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఇన్‌స్టాగ్రాంతో పాటు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ఈ సందర్భంగా ఒక వ్యక్తిగా తన తండ్రిని ప్రస్తావిస్తూనే తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు. తనకు తెలిసిన అత్యంత శక్తిమంతమైన వ్యక్తి తన తండ్రేనని పేర్కొంటూ అందరి తండ్రులకు పాదర్స్ డే శుభాకాంక్షలు అని తెలియజేశాడు. చిన్నతనంలో ఎప్పుడూ నాన్న ఒడిలోనే ఉండేవాడినని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

కాగా తన 18 ఏళ్ల వయసులోనే విరాట్ కోహ్లీ తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తాను కర్ణాటక జట్టుపై ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి వచ్చి చనిపోయినా, తాను క్రికెట్‌ను కొనసాగించానని ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న కోహ్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు తన తండ్రిపై ఉన్న ప్రేమ చేతనే 18 అనే సంఖ్యనే తన జెర్సీపై పెట్టుకున్నాడు. 2006, డిసెంబర్ 18న కోహ్లీ తండ్రి చనిపోయారు. అండర్-19 జట్టుకు ఆడిప్పటి నుంచి కూడా కోహ్లీ అదే నెంబర్‌ను విరాట్ కోహ్లీ కొనసాగిస్తున్నాడు.