
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల వివాహ బంధానికి మూడేళ్లు పూర్తైంది. ఈరోజు (డిసెంబర్ 11) విరాట్-అనుష్క జంట మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ తన సతీమణిని గుర్తు చేసుకుంటూ వివాహం నాటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. '3 ఏళ్లుగా.. ఇంకా జీవితాంతం' అని కోహ్లీ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచాయి, ఇక జీవితాంతం ఇలానే కలిసి ఉండాలి కోహ్లీ పేర్కొన్నాడు.
మరోవైపు అనుష్క శర్మ కూడా ఓ పోస్ట్ చేశారు. అందులో కోహ్లీని పట్టుకుని సరదాగా నవ్వుతున్నారు. 'అప్పుడే మూడు సంవత్సరాలు గడిచాయి. మేము ముగ్గురం. మిస్ యూ' అని కెప్టెన్ పెట్టారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు అందరూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కోహ్లీ, అనుష్క పెళ్లికిముందు ఓ యాడ్ షూట్ సందర్భంగా కలిశారు. మనసులు కలవడంతో కొన్నేళ్లు ప్రేమాయణం సాగించారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో.. 2017 డిసెంబర్ 11న ఇటలీలో అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. విరుష్క దంపతులు ఇటీవల మరో శుభవార్త చెప్పారు. జనవరిలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు వెల్లడించారు. కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. అనుష్క భారత్‌లో ఉన్నారు. దీంతో మూడో వార్షికోత్సవంను వారిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో జరుపుకున్నారు.
నిలకడైన ఆటతో అరుదైన ఘనతలను అందుకునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం బయట కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. కరోనా మహమ్మారితో ఈ ఏడాది అంతగా క్రికెట్ మ్యాచ్‌లు జరగకున్నా.. విరాట్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. తాజాగా ట్విటర్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్ విరాట్ కోహ్లీదేనని ట్విటర్ ఇండియా పేర్కొంది.