ధోనీ, రోహిత్ రికార్డులు బ్రేక్.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
రాయ్‌పూర్ వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2026 పోరు కేవలం ఓ మ్యాచ్‌గానే మిగిలిపోలేదు.. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన సందర్భానికి సాక్ష్యంగా నిలిచింది. మే 13, 2026న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ధోనీ, రోహిత్ రికార్డులు బ్రేక్
ఆర్సీబీ జెర్సీ ధరించి విరాట్ కోహ్లీ తన 279వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడటం విశేషం. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలను కోహ్లీ అధిగమించాడు. ధోనీ, రోహిత్ ఇద్దరూ చెరో 278 మ్యాచ్‌లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు విరాట్ కోహ్లీ 279 మ్యాచ్‌లతో ఐపీఎల్ 'సుల్తాన్'గా అవతరించాడు. ధోనీ సీఎస్కే, పుణే జట్ల తరపున.. రోహిత్ డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున ఈ మైలురాయిని చేరుకోగా.. కోహ్లీ మాత్రం ఒకే జట్టుతో ఈ ఫీట్ సాధించడం విశేషం.

ఒకే టీమ్.. 19 ఏళ్ల ప్రయాణం
విరాట్ కోహ్లీ సాధించిన ఈ ఘనత చాలా ప్రత్యేకమైనది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి 2026 వరకు అంటే 19 సీజన్ల పాటు ఆయన కేవలం ఆర్సీబీ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లలో అన్ని సీజన్లు ఒకే టీమ్ తరపున ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే. ఈ 279 మ్యాచ్‌ల ప్రయాణం కేవలం గణాంకం మాత్రమే కాదు.. బెంగళూరు నగరం, ఆర్సీబీ టీమ్ పట్ల ఆయనకు ఉన్న తిరుగులేని విధేయతకు ఇది నిదర్శనం.
రన్ మెషీన్.. తిరుగులేని రికార్డులు
కేవలం మ్యాచ్‌ల సంఖ్యలోనే కాదు, పరుగుల వేటలోనూ విరాట్ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ 279 మ్యాచ్‌ల్లో ఆయన ఇప్పటివరకు 9,040 పరుగులు సాధించి ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (7,289 పరుగులు), ఎంఎస్ ధోనీ (5,439 పరుగులు) ఉన్నారు. కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా, అవసరమైనప్పుడు బంతితోనూ మెరిసి 4 వికెట్లు పడగొట్టాడు. నిలకడకు మారుపేరుగా నిలిచే కోహ్లీ, తన అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లకు ఎప్పుడూ సింహస్వప్నంలాగే ఉన్నాడు.
14 వేల పరుగుల మైలురాయికి చేరువలో..
ఈ చారిత్రాత్మక మ్యాచ్‌తో పాటు కోహ్లీ మరో భారీ రికార్డుపై కన్నేశాడు. ఇప్పటివరకు ఆడిన 426 టీ20 మ్యాచ్‌ల్లో (అంతర్జాతీయ, ఐపీఎల్, డొమెస్టిక్ కలిపి) ఆయన 13,922 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 14,000 పరుగుల మార్కును చేరుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచేందుకు ఆయనకు కేవలం 78 పరుగులు మాత్రమే కావాలి. ఈ రికార్డు కూడా పూర్తయితే టీ20 ఫార్మాట్‌లో కింగ్ కోహ్లీ తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించినట్లవుతుంది. 2008లో ఓ సాధారణ యువకుడిగా కెరీర్ ప్రారంభించి, నేడు ప్రపంచ క్రికెట్ బ్రాండ్‌గా ఎదగడం కోహ్లీ పట్టుదలకు నిదర్శనం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications