
తియ్యని విజయం:
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... 'ఈ మధ్య కాలంలో టీమిండియాకు ఇదే తియ్యని విజయం. మరేదీ దీనికి సాటిరాదు. వేగంగా 9 వికెట్లు తీయడం గొప్ప ప్రదర్శన. మేం ఆటలో తిరిగి పుంజుకోవడం అద్భుతమే. ప్రస్తుతం నేనెంతో గర్విస్తున్నాను' అని అన్నాడు. ధావన్ (98)కు తోడుగా రాహుల్, కృనాల్, కోహ్లీ అర్ధ శతకాలు చేయడంతో భారత్ 318 పరుగులు చేసింది. ఛేదనలో బెయిర్‌స్టో, రాయ్ విజృంభించడంతో ఇంగ్లండ్ 15 ఓవర్లకే 135 పరుగులు చేసింది. ఈ క్రమంలో అరంగేట్రం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (4/54) చెలరేగి వారిని దెబ్బకొట్టాడు. శార్దూల్ 3, భువనేశ్వర్ 2 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించారు.

ధావన్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి:
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్, కీలక పరుగులు చేసిన శిఖర్ ధావన్‌పై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. 'మేం ఇంతకు ముందే చెప్పాం. కసితో ఉండే ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం. ధావన్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుల్ సైతం అంతే. పరుగులు చేసేవాళ్లు, నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకు మేం కచ్చితంగా అవకాశాలు ఇస్తాం. ప్రస్తుతం ప్రతి స్థానానికి 2-3 ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మేం సరైన దారిలో పయనిస్తున్నాం. ఎంచుకోవడానికి మాకు ఎంతోమంది ఆటగాళ్లతో కూడిన బృందం ఉంది' అని అన్నాడు.

సహాయకారిగా ఉన్నాడు:
'తుది జట్టులో చోటు దొరకనప్పుడూ శిఖర్ ధావన్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అతడి దేహభాష చాలా బాగుంది. మాకెంతో సహాయకారిగా ఉన్నాడు. ఈరోజు ఫలితానికి గబ్బర్ అర్హుడు. మ్యాచ్‌లో సంక్లిష్టమైన దశలో అతడు ఆడాడు. అతడు చేసిన 98 పరుగులు స్కోరు బోర్డులో కనిపించేవాటి కన్నా ఎంతో విలువైనవి' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో విరాట్ 56 పరుగులు సాధించాడు. ఇది కోహ్లీకి 61వ వన్డే హాఫ్ సెంచరీ. ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కోహ్లీ అరుదైన ఘనత:
తొలి వన్డే ద్వారా విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. స్వదేశంలో 10 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాట్స్‌మన్‌గా అతడు నిలిచాడు. అంతకుముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను నమోదు చేసిన తొలి టీమిండియా క్రికెటర్. భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. శుక్రవారం రెండో మ్యాచ్ జరగనుంది.


Click it and Unblock the Notifications












