
అడిలైడ్: రెండు రోజులు తీవ్రంగా శ్రమించి బాగా ఆడామని, ఓ గంట పేలవమైన ఆటతో దారుణమైన స్థితికి వెళ్లామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆసీస్ చేతిలో ఓటమిపై స్పందించడానికి మాటలు రావట్లేదని భావోద్వేగం చెందాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో టీమిండియా ఘోరపరాజయాన్ని చవిచూసింది. 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై.. నాలుగు టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకు పరిమితమై విమర్శలు ఎదుర్కొంటోంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మాట్లాడడానికి మాటలు రావట్లేదు. 60 పరుగుల ఆధిక్యంతో మైదానంలోకి వచ్చిన మేం పేకమేడలా కుప్పకూలాం. రెండు రోజులు తీవ్రంగా శ్రమించి, జట్టు పటిష్ఠ స్థితిలో ఉన్నప్పుడు.. ఓ గంట పేలవమైన ఆటతో దారుణమైన స్థితికి వెళ్లాం. అలాంటి దశలో విజయం సాధించడం అసాధ్యం. మేం మరింత తీవ్రతతో ఆడాల్సి ఉంది. చాలా బాధగా ఉంది' అని అన్నాడు.
ఆస్ట్రేలియా బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశారని, కానీ బలహీనమైన ఆలోచన విధానం వల్లే వికెట్లు కోల్పోయామని విరాట్ కోహ్లీ అన్నాడు. 'ఆస్ట్రేలియా బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే బౌలింగ్ చేశారు. కానీ మా ఆలోచన విధానం వల్లే వికెట్లు కోల్పోయాం. పరుగులు సాధించడం అసాధ్యం, బౌలర్లు ఆత్మవిశ్వాసంతో బంతులు వేస్తున్నారన్నట్లుగా ఆడుతున్నట్లు అనిపించింది. బ్యాటింగ్‌లో తీవ్రత లేకపోవడం, మంచి ప్రదేశాల్లో ఆసీస్ బౌలర్లు బౌలింగ్ చేయడంతో మా ప్రదర్శన ఇలా సాగింది' అని పేర్కొన్నాడు.
మెల్‌బోర్న్ వేదికగా జరిగే రెండో టెస్టులో టీమిండియా బలంగా పుంజుకుంటుందని విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టుగా పోరాడితే మంచి ఫలితం వస్తుందని, భారత ఆటగాళ్లు తిరిగి గొప్పగా సత్తాచాటుతారని అన్నాడు. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్‌డే టెస్టు ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమవుతున్న సంగతి తెలిసిందే. పితృత్వ సెలవులపై అతడు స్వదేశానికి తిరిగిరానున్నాడు. దీంతో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అజింక్య రహానే అందుకుంటాడు.
విరాట్ కోహ్లీ 2020ని ఒక్క సెంచరీ లేకుండా పూర్తి చేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులే చేసిన విరాట్.. ఈ ఏడాదిని అలా ముగించాడు. దీంతో 2008 తర్వాత తొలిసారి సెంచరీ లేకుండా నిలిచాడు. కోహ్లీ అరంగేట్రం చేసిన ఏడాది మినహాయిస్తే.. ఏటా శతకాలతో మైమరపించాడు.