
పేరు ప్రతిష్ఠలు ఇవ్వడానికి సిద్ధం:
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను కూడా బాగా ఆడతావని తెలుసు. ఇతరులను ప్రేరేపించే ఏ అవకాశం వచ్చినా నేను ఇష్టపడతాను. అలాగే ఏ ఆటగాడికైనా దేశం తరఫున ఆడటమే అతిపెద్ద గర్వకారణం. నేను కూడా అందుకు సంతోషిస్తున్నా. ఇక ఎవరైనా నా వద్దకు వచ్చి నీ పేరు ప్రతిష్ఠలు ఇవ్వడానికి ఇష్టమేనా అని అడిగితే.. మాట్లాడకుండా ఇచ్చేస్తా. నాకు సాధారణ జీవితం గడపడమంటేనే చాలా ఇష్టం. ఒక స్థాయికి చేరాక ఏది ముఖ్యమైన పనో అదే చేస్తున్నామని గ్రహిస్తాం. చివరికి సాధారణ జీవితమే గడపాల్సి ఉంటుంది' అని చెప్పాడు.

గతంలో స్వేచ్ఛ ఉండేది:
'గతంలో ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లడానికి స్వేచ్ఛ ఉండేది. ప్రతి నిమిషం నువ్వేం చేస్తున్నావో అని అంటిపెట్టుకొని ఉండడానికి.. అప్పుడు ఎవరి చేతుల్లోనూ కెమెరా ఫోన్లు ఉండేవి కావు. నేను, అనుష్క మా ఇంట్లో సాధారణ పనులు చేసుకోడానికి ఇష్టపడతాం. దాన్ని ఆస్వాదిస్తాం. ఇక పేరు ప్రతిష్ఠలు, గుర్తింపు, మేం ఏం చేస్తున్నామనే లాంటి విషయాలను నేను పట్టించుకోను. ఇలాంటి విషయాలు మన జీవితాలను ముందుకు సాగనీయవని నాకనిపిస్తుంది. అనుష్క, నేను సామాజిక మాధ్యమాలతో కలిసి పెరగలేదు. ఒకవేళ మేం వీటిని వాడొద్దని నిర్ణయించుకుంటే చాలా ఈజీగా వాటి నుంచి వైదొలుగుతాం. ఇప్పటి తరానికి ఇది చాలా కష్టంగా ఉండొచ్చు. నేనైతే.. ఇవన్నీ నా నుంచి తీసుకెళ్లండని చెప్పేస్తా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఏకైక క్రికెటర్ కోహ్లీ:
ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల టాప్-100 జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది. ఫోర్బ్స్ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో భారత కెప్టెన్ 66వ స్థానంలో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే.. విరాట్ 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. కోహ్లీకి ఎండార్స్‌మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా.. 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్-100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు :
విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. 4 సంవత్సరాల తరువాత 2017, డిసెంబర్ 11 విరాట్-అనుష్క ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












