India vs England: జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్‌కి అవార్డులు.. మావాళ్లకు రాలేదని కోహ్లీ ఆశ్చర్యం! ఏమన్నాడంటే?

పూణే: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే చివరి బంతి వరకు విజయం ఇంగ్లండ్‌దా? భారత్‌దా? అని ఊగిసలాడింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ (95 నాటౌట్; 83 బంతుల్లో 9×4, 3×6) భారత్‌కు చుక్కలు చూపించాడు. ఇంగ్లండ్‌కు విజయం అందించడానికి కడవరకు పోరాడాడు. ఓ దశలో కరన్ దెబ్బకు భారత్ ఓడిపోతుందనుకున్నారు. అయితే చివరి ఓవర్‌ను టీ నటరాజన్ అద్భుతంగా వేయడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. కరన్ పోరాట పటిమగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.

కోహ్లీ ఆశ్చర్యం:
సామ్ కరన్‌కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిడిల్ ఓవర్స్‌లో బౌలర్లు వికెట్లు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నా. కానీ అందుకు భిన్నంగా సామ్ కరన్ ఎంపిక విస్మయానికి గురిచేసింది. ఇక ప్లేయర్ 'ఆఫ్ ది సిరీస్'కు భువనేశ్వర్ అర్హుడు' అని అన్నాడు. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు.

ఆకట్టుకున్న భువీ, శార్ధూల్:
సిరీస్ సాంతం పొదుపుగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్.. చివరి వన్డేలో తన కోటా 10 ఓవర్లు వేసి 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వన్డే సిరీస్‌లో భువీ 6 వికెట్లు పడగొట్టాడు. భారత పేస్ దళాన్ని తనదైన శైలిలో ముందుకునడిపాడు. మూడో వన్డే శార్ధూల్ ఠాకూర్ 67 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మలుపు తిప్పిన ఘనత కూడా ఠాకూర్‌కే దక్కుతుంది. రెండో వన్డేలో తేలిపోయినా.. మొదటి మ్యాచులో ఆకట్టుకున్నాడు. సిరీస్‌లో ఠాకూర్ 7 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అందుకే ఠాకూర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు ఇవ్వకపోవడంపై కోహ్లీ పెదవి విరిచాడు.

ఈ విజయం ఎంతో మధురం:
'టాప్-2 జట్ల మధ్య మ్యాచ్ అంటే.. రసవత్తరంగా సాగుతుంది. ఓడిపోవాలని ఎవరూ అనుకోరు. సామ్ కరన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ మా బౌలర్లు వికెట్లు తీశారు. చివరలో హార్దిక్ పాండ్యా, నటరాజన్ మంచి బంతులేశారు. మ్యాచ్‌లో క్యాచ్‌లు జారవిడచడం తీవ్ర నిరాశకి గురిచేసింది. ఒక్కోసారి ఈ తప్పిదాలకి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చివరకు మాత్రం కొన్ని మంచి మ్యాచులు అందుకున్నాం. ప్రసీద్ మరియు క్రునాల్ ఆకట్టుకున్నారు. డెత్ ఓవర్ల బ్యాటింగ్ చాలా బాగుంది. టాప్ ఆర్డర్ బాగా ఆడితే భారీ స్కోర్ చేయొచ్చు. ఈ విజయం ఎంతో మధురం. ఎందుకంటే ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్టుపై గెలిచాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

బయపెట్టిన కరన్:
మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్ (67), పంత్ (78) హార్దిక్ (64) అర్ధ శతకాతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్‌వుడ్ (3/34), రషీద్ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడిన సామ్ కరన్ (95 నాటౌట్) భారత్‌ను భయపెట్టాడు. మలన్ (50) ఆకట్టుకున్నాడు. శార్దూల్ (4/67), భువనేశ్వర్ (3/42) సత్తాచాటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications