
హైదరాబాద్: 'మ్యాచ్‌ల కోసమని ప్రపంచమంతా తిరుగుతుంటాను. కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరైనా నిర్ణయం తీసుకుంటుంది అనుష్క' అని తన సతీమణిని తెగ పొగిడేస్తున్నాడు కెప్టెన్ కోహ్లీ. టీమిండియాతో పాటు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్సీ వహిస్తోన్న కోహ్లీ ఇటీవల ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఇలా మాట్లాడాడు.
ఆమే తన బలమని తెలిపారు. 'అనుష్క నా పూర్తి బలం. ఎప్పుడూ నన్ను పాజిటివ్‌గా ఉంచుతుంది. జీవిత భాగస్వామి నుంచి కోరుకునేది అదేగా. అవును.. నేను చాలా అదృష్టవంతుడ్ని.' అని విరాట్ ఆనందంతో అన్నారు. 'ఆఫ్ ద ఫీల్డ్ ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు అంటే ముమ్మాటికీ తనే. ఎందుకంటే తనెప్పుడూ కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటుంది' అని చెప్పాడు కోహ్లీ.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా ఒకర్ని మరొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు. దీనికి వీరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే పోస్టులే నిదర్శనం. అనుష్క సినిమా విశేషాల గురించి విరాట్ స్పందిస్తుంటారు. కోహ్లీని ఉత్సాహపరుస్తూ అనుష్క కూడా ట్వీట్లు చేస్తుంటారు.
చాలా ఏళ్లు ప్రేమలో ఉన్న తర్వాత విరాట్, అనుష్క గత ఏడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత వీరు సోషల్‌మీడియా వేదికగా తమ ప్రేమను తెలుపుతూ వచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో తీసిన ఫొటోలను షేర్ చేశారు.