
హైదరాబాద్: ఆదివారం మాతృదినోత్సవం. ఈ సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్క తల్లికి తమ కుమారులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు సోషల్ మీడియాలో తమ తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ విషెస్ చెబుతున్నారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తన తల్లికి వినూత్నంగా విషెస్ తెలిపారు. మరాఠిలో తల్లిని 'ఆయి' అని పిలుస్తారు. అయితే సచిన్ ఆయికి ఓ సరికొత్త అర్థాన్ని వివరిస్తూ ట్వీట్ చేశారు. 'నువ్వు నా 'ఆయి'వి ఎందుకంటే.. నువ్వు ఒక అద్భుతానివి మరియు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి. నా కోసం చేసిన ప్రతీ పనికి ధన్యవాదాలు' అంటూ సచిన్ ట్వీట్ చేశారు. తన తల్లి తనను ఎత్తుకున్న ఫొటోని సచిన్ ఈ ట్వీట్‌కి జత చేశారు.
తన పుట్టిన రోజున కూడా సచిన్ తన తల్లితో కలిసి దిగిన ఫొటోను సచిన్ షేర్ చేశారు. 'నా తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో నా రోజు ప్రారంభమైంది. ఆ నాకు ఇచ్చిన గణపతి బప్ప ఫొటోని షేర్ చేస్తున్నాను. ఇది ఎంతో అమూల్యమైంది' అంటూ సచిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, వీరేంద్ర సెహ్వాగ్, యజువేంద్ర చాహల్, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రవిశాస్త్రి తదితరులు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.
అమ్మ వెంట ఉంటే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాడు రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అన్నాడు. ఆమె తన అదృష్ట దేవత అని పేర్కొన్నాడు. సాత్విక్ ఆడుతున్న మ్యాచ్‌లు చూసేందుకు ఆమె వచ్చిన సందర్భాల్లో 95 శాతం అతడు విజయాలు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న సాత్విక్ తల్లి రంగమణి.. ఇద్దరు కొడుకులతో పాటు పాఠశాలలోనే వేలాదిమంది భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందని చెప్పింది.