
లండన్: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీని ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఓ క్రికెటర్‌గా కంటే అమితంగా అతణ్ని అభిమానిస్తారు, ఆరాధిస్తారు జనం. అతని వ్యక్తిత్వం వల్ల కావచ్చు, దూకుడుతో కూడుకున్న మనస్తత్వం వల్లా కావచ్చు. విరాట్ అంటే పడి చచ్చే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంది. దేశ, విదేశాల్లోనూ విరాట్‌కు అభిమానులు ఉన్నారు. శతృదేశం పాకిస్తాన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.
ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా ఫుల్ ఫామ్‌లోనే ఉన్నాడు విరాట్. ఈ మూడింటితో కలిపి ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య పదికోట్లకు పైమాటే. విరాట్ కోహ్లీ అంటే క్రేజు ఏమాత్రం తగ్గడంలేదు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు.
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా- ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడతను. ఈ సందర్భంగా ధోనీ కొట్టిన ఓ సిక్స్.. విరాట్ కోహ్లీని ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ భారీ స్కోరు అందించడంలో ధోనీ కూడా తన వంతు పాత్ర పోషించాడు. భారీ షాట్లతో అలరిస్తూ.. వేగంగా 27 పరుగులు చేశాడు. మిఛెల్ స్టార్క్ వేసిన బంతిని ధోనీ సిక్స్‌గా మలిచాడు.
గంటకు 143 కిలోమీటర్ల వేగంగా స్టార్క్ వేసిన బంతిని డీప్ స్క్వేర్ లేగ్ దిశగా ఫెన్సింగ్ దాటించాడు ధోనీ. ఆ సమయంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. దీన్ని చూసి నోరెళ్లబెట్టాడు. వావ్ అంటూ ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన ఓ మూడు సెకెన్ల పాటు ఉన్న వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో రికార్డులను సృష్టించింది. భారత కాలమానం ప్రకారం.. గురువారం మధ్యాహ్నానికి మూడు కోట్ల మంది ప్రజలు ఈ వీడియోను చూశారు. ఈ విషయాన్ని లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ వెల్లడించాడు. తన వీడియోను మూడు కోట్ల మంది చూశారని, వారందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నాడు.