
హైదరాబాద్: ఇటీవల ముగిసిన సఫారీ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్తంత ఎక్కువ దూకుడినే ప్రదర్శించాడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. సఫారీ గడ్డపై 58 రోజుల సుదీర్ఘ పర్యటనను కోహ్లీసేన విజయంతో ముగించిన సంగతి తెలిసిందే.
తొలుత జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో చేజార్చుకున్నప్పటికీ, తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీసేన పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం. ఆరు వన్డేల సిరిస్‌ను 5-1తో, ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుని వరుసగా రెండు సిరిస్‌లను నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
"దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీని చూశాను. కెప్టెన్‌గా కోహ్లీ అతి చేశాడని అనిపించింది. అయితే, అతడు ప్రస్తుతం నేర్చుకునే దశలో ఉన్నాడు" అని లారస్ వరల్డ్ స్పో అవార్డుల కార్యక్రమంలో అన్నాడు. కోహ్లీలాగా జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా దూకుడుగా వ్యవహారించే స్వేచ్ఛ ఇచ్చినట్లు లేడని తెలిపాడు.
'గొప్ప కెప్టెన్‌గా ఎదిగేందుకు కోహ్లీకి ఇంకా సమయం పడుతుంది. ముఖ్యంగా మైదానంలో ఆడే సమయంలో ఎమోషన్స్‌ని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. జట్టులోని ఆటగాళ్లు అందరూ తన లాగే ఒకే పద్ధతిలో ఆడలేరన్న విషయం గ్రహించాలి. రహానే, పుజారాలు చాలా నెమ్మదిగా ఉంటారు. కొందరు ఆటగాళ్లు భిన్నంగా ఉంటారనే విషయం కోహ్లీ గ్రహించాలి' అని పేర్కొన్నాడు.
'అన్ని సార్లు ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం కుదరదు. కానీ, ప్రస్తుతం జట్టుని నడిపిస్తున్న తీరు అద్భుతం. అందుకే జట్టులోని ఆటగాళ్లు అంతా కోహ్లీనే ఫాలో అవుతున్నారు. అన్ని సందర్భాల్లో కూడా జట్టు సమిష్టిగా పోరాడి విజయం సాధించాలని కోరుకుంటున్నాడు' అని చెప్పాడు.
'గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన విజయాల రికార్డుని నమోదు చేసింది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధించాలనే కోరికను విరాట్ కలిగి ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కూడా తన జట్టే నెంబర్ వన్ స్థానంలో కొనసాగాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుత రోజుల్ల అది చాలా కష్టం' అని స్టీవ్ వా అన్నాడు.
ఈ ఏడాది చివర్లో కోహ్లీసేన ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యనటలతో రెండు అతిపెద్ద ఛాలెంజ్‌లు ఉన్నాయి. ఈ పర్యటనల్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను, ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆడనుంది. ఆస్ట్రేలియా పర్యనటలో విరాట్ కోహ్లీ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని అన్నాడు.
'ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా ఫేవరేట్‌గా ఉంటుంది. ఎందుకంటే స్వదేశంలో ఇండియా ఎలాగైతే బలమైన జట్టో అదే విధంగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత విజయాల్లో కోహ్లీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. గత ఆసీస్ పర్యటనలో కోహ్లీ అద్భుతంగా రాణించాడు' అని స్టీవ్ వా వెల్లడించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ వరకు ఆడే సత్తా ఉందని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. 'ధోని ఇప్పటికీ ఓ అద్భుతమైన ఆటగాడు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ వరకు అతడు అదే ఎనర్జీతో కొనసాగుతాడని అనుకుంటున్నా. ఫామ్‌ను నిలబెట్టుకునేందుకు 12 నెలలు కాస్త ఎక్కువ సమమయే' అని పేర్కొన్నాడు.