
హైదరాబాద్: పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా చర్చనీయాంశమే. అతని హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి.. పెళ్లి విషయం దాకా. ఇప్పుడు కోహ్లీ కౌంటీ క్రికెట్ అడుతుండటం కూడా అంతే సంచలనం లేపుతోంది. ఐపీఎల్ వేలంలో కొనుగోలు కాని ఆటగాళ్లలో కొందరు కౌంటీల్లో ఆడుతున్నారు. ఇందులో భాగంగానే భారత ఆటగాడు పుజారా. యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
విరాట్ కోహ్లీ కూడా కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే సర్రే జట్టు తరఫున కోహ్లీ సుమారు నెల రోజుల పాటు మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు, 3 వన్డేలు ఆడనున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సన్నద్ధమయ్యేందుకు కోహ్లీ ఈ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు.
జూన్ 25-28 తేదీల మధ్య యార్క్‌షైర్‌తో ఆడే కౌంటీ మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడని సర్రే క్లబ్ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ రెండు జట్ల తరఫున భారత ఆటగాళ్లు కోహ్లీ, పుజారా ఆడుతున్నారు.
ప్రత్యర్థి అయిన కోహ్లీని ఎలా దెబ్బకొట్టొచ్చో, ఎలా ఔట్ చేయాలి తదితర రహస్యాలన్ని పుజారా తన జట్టు సభ్యులకు చెప్పేశాడా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
'కోహ్లీ కాళ్లపైనే దృష్టి పెట్టు. అదే కీలకం. అతన్ని ఔట్ చేయాలంటే ఓర్పు అవసరం' అని పుజారా యార్క్‌షైర్ బౌలర్లకు చెప్పినట్లుగా ఓ ఇంగ్లీష్ పత్రిక పేర్కొంది. కోహ్లీ వికెట్ తీయాలని ఇప్పట్నుంచే కౌంటీల్లో భారీ ప్రణాళికలు మొదలైయ్యాయన్నమాట. ఈ నేపథ్యంలోనే పూజారా ఎత్తులు వేయడం మొదలెట్టేశాడు.