ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ క్రికెట్ అభిమానులకు విందు భోజనాన్ని వడ్జిస్తోంది. ముఖ్యంగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దేశవాళీ క్రికెట్లోకి రావడం, వారితో పాటు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డుల వర్షం కురిపించడంతో ఈ టోర్నీపై ఆసక్తి పెరిగింది. అయితే సోమవారం (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం కానున్న మూడో రౌండ్ ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లకు ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఇది ఆయా జట్లకే కాకుండా వారి ఆటను చూడాలనుకుంటున్న అభిమానులకు కూడా పెద్ద నిరాశే అని చెప్పాలి.
ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో 131 పరుగులతో అద్భుత సెంచరీ బాదిన కోహ్లీ, రెండో మ్యాచ్‌లో 77 పరుగులతో రాణించి ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే సౌరాష్ట్రతో జరగనున్న మూడో రౌండ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడటం లేదు. దీనికి ప్రధాన కారణం ముందస్తు ఒప్పందమే. సెలెక్టర్లతో జరిగిన చర్చల ప్రకారం, కోహ్లీ కేవలం మొదటి రెండు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాంప్‌ను వీడి ముంబై చేరుకున్నాడు. కోహ్లీ స్థానంలో యువ ఆటగాడు యశ్ ధుల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండగా.. రిషభ్ పంత్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

మరోవైపు ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో మెరిశాడు. సిక్కింపై కేవలం 94 బంతుల్లో 155 పరుగులు బాది 'హిట్ మ్యాన్' అనిపించుకున్నాడు. అయితే ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు డకౌట్ అయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరగనున్న మూడో రౌండ్ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉండటం లేదు. ముంబై సెలెక్టర్లు రోహిత్‌ను కేవలం మొదటి రెండు మ్యాచ్‌లకే ఎంపిక చేయడమే దీనికి కారణం. పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని లేదా వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రోహిత్ స్థానంలో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక ఈ టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రయాణం మరో మలుపు తిరిగింది. బీహార్ తరఫున ఆడుతూ అరుణాచల్ ప్రదేశ్‌పై 190 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. ఇకపై ఈ టోర్నీలో కనిపించడు. దానికి కారణం అతనికి లభించిన అరుదైన గౌరవం. వైభవ్ భారత అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. అంతేకాకుండా జనవరి 3 నుంచి దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానున్న యూత్ వన్డే సిరీస్‌కు అతడిని కెప్టెన్‌గా నియమించారు. దీని కోసం వైభవ్ సూర్యవంశీ జాతీయ క్యాంప్‌లో చేరాల్సి ఉండటంతో విజయ్ హజారే ట్రోఫీని వీడాల్సి వచ్చింది.
ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్ల ఢిల్లీ, ముంబై, బీహార్ జట్ల బ్యాటింగ్ బలం కొంత తగ్గినట్లు అనిపించినా, యువ ఆటగాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, యశ్ ధుల్ వంటి వారు సీనియర్ల స్థానాలను ఎలా భర్తీ చేస్తారో చూడాలి. అలాగే భారత అండర్-19 జట్టును వైభవ్ సూర్యవంశీ ఎలా నడిపిస్తాడో అని దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.