
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై మరోసారి ప్రశంసలు కురిపించాడు. సతీమణి అనుష్క నటించిన చిత్రాలు విడుదలైన వెంటనే వాటిని చూసి కోహ్లి రివ్యూలిస్తుంటాడు. అనుష్క నటించిన 'జీరో' చిత్రం శుక్రవారం విడుదలైంది. కోహ్లీ ఈ సినిమాను చూశాడట. దీంతో ట్విటర్ వేదికగా విరాట్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
జీరో చిత్రాన్ని తాను బాగా ఎంజాయ్ చేసినట్లు, ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారని, ముఖ్యంగా అనుష్క నటన బాగా నచ్చిందని ప్రశంసలతో ట్వీట్ చేశాడు. 'జీరో' చిత్రాన్ని చూశాను. ఎంతో వినోదాత్మకంగా ఉంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎవరి పాత్రలకు వారు బాగా న్యాయం చేశారు. నాకు అనుష్క శర్మ నటన బాగా నచ్చింది. ఆమెది ఇందులో ఛాలెంజ్‌తో కూడుకున్న పాత్ర అనిపించింది. ఇందులో తను అత్యద్భుతంగా నటించింది' అని అనుష్కపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు.
'జీరో' చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించారు. సెరిబ్రల్ పల్సీ ఉన్న శాస్త్రవేత్త ఆఫియా పాత్రలో అనుష్క కనిపించింది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో శుక్రవారం విడుదలైన ఈచిత్రం మంచి టాక్ అందుకుంటోంది.
ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. టీమిండియా బాక్సింగ్ డే టెస్టు విజయానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవగా, తొలి టెస్టును అడిలైడ్ వేదికగా ఆడి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలవడం ఇదే మొదటిసారి. ఇక రెండో విషయానికొస్తే పెర్త్ వేదికగా టీమిండియా విఫలమవుతోంది.