
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 14వ సీజన్ అనంతరం ఆర్‌సీబీ సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోనున్నాడు. కోహ్లీ నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఆర్‌సీబీ కెప్టెన్‌గా తాను ఎందుకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడో వివరించాడు కోహ్లీ. అధిక పనిభారమే కెప్టెన్సీ వదిలేయడానికి ముఖ్య కారణం అని కోహ్లీ చెప్పాడు. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లీ వర్చువల్ మీటింగ్‌లో పాల్గొని పైవిధంగా స్పందించాడు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ప్రధానంగా పనిభారమీ ఆర్‌సీబీ కెప్టెన్సీ వదిలేయడానికి ముఖ్య కారణం. నా బాధ్యతల విషయంలో నేను నిజాయతీగా లేకుండా వ్యవహరించలేను. నేను నా బాధ్యత పట్ల ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. దేనికైనా నేను 120 శాతం ఇవ్వలేకపోయిన సందర్భంలో దానినే పట్టుకొని వేలాడే వ్యక్తిని కాను. ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది' అని స్పష్టం చేశాడు. 2013లో ఆర్‌సీబీ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ కోహ్లీ ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయాడు.
గతంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఆర్‌సీబీ కెప్టెన్‌గా నాకు ఇదే చివరి ఐపీఎల్. ఎంతో ఆలోచించి టీమ్ అందరితో మాట్లాడిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నా. గతంలో చెప్పినట్లుగానే నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీలో ప్లేయర్‌గా కొనసాగుతా. చాలామంది టాలెంటెడ్ ప్లేయర్లున్న ఆర్‌సీబీ జట్టును కెప్టెన్‌గా నడిపించిన నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఈ అవకాశం నాకిచ్చిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్లందరికి ధన్యవాదాలు. నాపై నమ్మకంతో నాకు మద్దతుగా నిలిచిన ఆర్‌సీబీ అభిమానులకు కృతజ్ఞతలు' అని పేర్కొన్నాడు.
ఆర్‌సీబీ టీమ్‌మేనేజ్‌మెంట్ అసలు సిసలు కెప్టెన్ కోసం ఇప్పుటి నుంచి ప్రణాళికలు రచించనుంది. విరాట్ కోహ్లీ వారుసుడిగా ఆర్‌సీబీ కెప్టెన్ రేసులో ఓ నలుగురు ప్లేయర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏబీ డివిలియర్స్ వచ్చే సీజన్‌లో కూడా ఆడితే అతనికే ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు దక్కనున్నాయి. గత కొన్నేళ్లుగా జట్టుతో ఉన్న అతనికి టీమ్‌మేనేజ్‌మెంట్‌తో మంచి సంబంధాలున్నాయి. ఆర్‌సీబీ టీమ్‌లో ఉన్న గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు సారథ్య బాధ్యతలు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీజన్ వేలంతోనే ఆర్‌సీబీలోకి అడుగుపెట్టిన మ్యాక్సీ.. దుమ్మురేపాడు. డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్ పేర్లు కూడా వినిపిసున్నాయి.