హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస పెట్టి రికార్డులను బద్దలు కొడుతున్నాడు. కాన్పూర్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 32వ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగడంతో మూడు వన్డేల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీ సోమవారం ప్రకటించిన ర్యాంకుల జాబితాలో కోహ్లీ మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్‌ని అందుకున్నాడు.
అంతేకాదు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు ఒకటి బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఓ భారత క్రికెటర్ సాధించిన అత్యధిక రేటింగ్ పాయింట్లు సచిన్ టెండూల్కర్ (887 రేటింగ్ పాయింట్లు) పేరిట ఉంటేది. అయితే ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీ 889 పాయింట్లతో అధిగమించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌లో మొత్తం 263 పరుగులు చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ సిరిస్ అవార్డు కూడా లభించింది. ఈ క్రమంలో కోహ్లీ అత్యధికంగా 889 రేటింగ్ పాయింట్లు సాధించి వన్డేల్లో తన ర్యాంకుని కూడా మెరుగుపరచుకున్నాడు.
సరిగ్గా పదిరోజుల కిందట దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ అగ్రస్ధానంలో నిలవడంతో తన ర్యాంకుని కోల్పోయిన కోహ్లీ మళ్లీ దానిని చేజిక్కించుకున్నాడు. ఏబీ డివిలియర్స్ 872 పాయింట్లు, ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 865 పాయింట్లతో ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక స్థానం మెరుగుపరుచుకొని 11వ స్థానానికి ఎగబాకాడు. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కివీస్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ 15 స్థానాలు ఎగబాకి కెరీర్‌లోనే బెస్ట్ 23వ ర్యాంక్‌ని సొంతం చేసుకున్నాడు.
ఇక, భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా కెరీర్‌లోనే బెస్ట్ మూడో ర్యాంక్ సాధించాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో ఆరు వికెట్లు తీశాడు. కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో చివరి ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్ చేశాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టీమిండియా రెండో స్ధానంలో కొనసాగుతోంది. 121 పాయింట్లతో దక్షిణాఫ్రికా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది.