Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి విరాట్ కోహ్లీ భారత జట్టు తరఫున వన్డే క్రికెట్‌లో మాత్రమే మైదానంలో కనిపిస్తాడు.
విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్
విరాట్ కోహ్లీ 2008లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ తన తొలి టెస్ట్ ఆడడానికి 3 సంవత్సరాలు వేసి ఉండాల్సి వచ్చింది. 2011 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. విరాట్ కోహ్లీ జమైకాలో కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. అదే సంవత్సరం వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ తొలి అర్థ సెంచరీ చేశాడు.

2012 ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన తర్వాత.. విరాట్ మూడో మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు. అడిలైడ్‌లో జరిగిన చివరి టెస్టులో భారత్ ఓడిపోయింది కానీ విరాట్ 116 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దీని తర్వాత విరాట్ కోహ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. విరాట్ కోహ్లీ భారత్ తరఫున 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో కోహ్లీ 46.85 సగటుతో 30 సెంచరీలతో 9230 పరుగులు చేశాడు.
భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు
విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఏడు డబుల్ సెంచరీలతో టెస్ట్ ఫార్మాట్‌లో తనను తాను ఒక లెజెండ్‌గా నిరూపించుకున్నాడు. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ సునీల్ గవాస్కర్(4), సచిన్ టెండూల్కర్(6), వీరేంద్ర సెహ్వాగ్(6), రాహుల్ ద్రవిడ్(5) కంటే చాలా ముందున్నాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టులు గెలిచిన కెప్టెన్‌గా కూడా విరాట్ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 40 టెస్టుల్లో విజయం సాధించింది. రెండు స్థానంలో ఉన్న ఎంఎస్ ధోని పేరు మీద 27 విజయాలు ఉన్నాయి.
పరుగులు, సెంచరీలలో ముగ్గురు మాత్రమే ముందున్నారు..
భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ మాత్రమే కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఈ ముగ్గురూ 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించారు. సెంచరీల పరంగా విరాట్ కోహ్లీ నాల్గవ స్థానంలో ఉన్నాడు. సెంచరీలలో కూడా సచిన్, ద్రవిడ్, గవాస్కర్ పేర్లు కోహ్లీ కంటే ముందున్నారు. తన కెరీర్‌లో చివరి టెస్టును ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడాడు.