Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ భావోద్వేగభరిత పోస్ట్ చేశాడు. రోహిత్ రిటైర్ అయిన తర్వాత కోహ్లీ కూడా రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ కోహ్లీని ఒప్పించడానికి ప్రయత్నించింది కానీ కింగ్ కోహ్లీ అంగీకరించలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశం రాసి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ పర్యటన కోసం టెస్ట్ క్రికెట్ జట్టును త్వరలో ప్రకటించాల్సి ఉందని తెలిసిందే.
విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత్ తరఫున అత్యంత సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్ కూడా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 68 మ్యాచ్‌లలో 40 మ్యాచ్‌లు గెలిచారు. 2016-2019 మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కోహ్లీ 43 టెస్ట్ మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడు. కోహ్లీ 69 ఇన్నింగ్స్‌లలో 16 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఇది కోహ్లీని టెస్ట్ క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా నిలిపింది.

ఇలా రాసుకొచ్చిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చాడు. " నేను 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించాను. ఈ టెస్ట్ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని అస్సలు ఊహించలేదు. అది నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది. నా జీవితానికి సరిపడాపాఠాలను నేర్పింది. తెల్లని దుస్తుల్లో ఆడటం నా మనసుకు చాలా ప్రత్యేకమైనది. నిశ్శబ్దంగా చేసిన కృషి, సుదీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి. అలాంటి టెస్ట్ ఫార్మాట్ నుంచి దూరం కావడం నాకు అంత తేలిక కాదు. కానీ ఈ నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. నేను ఈ ఫార్మాట్ కోసం ఎంతో ఇచ్చాను. అది నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతా భావంతో ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నా. వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్ చూసుకుంటే నా మోములో చిరునవ్వు కనిపిస్తుంది. ప్రేమతో సైనింగ్ ఆఫ్.." అంటూ విరాట్ కోహ్లీ రాసుకొచ్చాడు.