భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ మాజీ సహచర ఆటగాడు దినేష్ కార్తీక్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని కోహ్లీ గట్టిగా నిశ్చయించుకున్నాడని.. ప్రస్తుతం ఆయన శిక్షణలో ఇదే మొదటి ప్రాధాన్యత అని దినేష్ కార్తీక్ వెల్లడించారు. విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో 2027 ప్రపంచ కప్‌లో ఆడతాడా లేదా అనే ప్రశ్నలు అభిమానుల్లో, విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఏడు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌తో వన్డే ఫార్మాట్‌లోకి తిరిగి వస్తుండగా ఈ వార్త మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
కోహ్లీ ప్లాన్స్ ఇవే..
తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. "అతను ప్రపంచ కప్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అదే అతనికి మొదటి ప్రాధాన్యత" అని స్పష్టం చేశారు. సుదీర్ఘ విరామం సమయంలో విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌ను, బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదని కార్తీక్ తెలిపారు. "లండన్‌లో ఉన్నప్పుడు కూడా, సుదీర్ఘ విరామం తరువాత, అతను వారంకు రెండు నుంచి మూడు క్రికెట్ ప్రాక్టీస్ సెషన్లు సులభంగా చేస్తున్నాడని నాకు తెలుసు" అని కార్తీక్ పంచుకున్నారు.

'కోహ్లీ ఉంటే, టెన్షన్ ఉండదు'
ప్రపంచ కప్‌లో ఆడాలనే కోహ్లీ అంకితభావం, కఠోర సాధన చూస్తుంటే అతను చాలా సీరియస్‌గా ఉన్నాడని కార్తీక్ స్పష్టం చేశారు. "ఇది అతను ప్రపంచ కప్ ఆడటానికి ఎంత సీరియస్‌గా ఉన్నాడో తెలియజేస్తుంది. అతను టీమ్‌లో ఉంటే, నాకు తెలిసి టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఒత్తిడిలో ఎలా ఆడాలి, అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వాలో అతనికి తెలుసు. అతను దానిని పదే పదే చేసి చూపించాడు. కాబట్టి అతను మళ్లీ అదే చేస్తాడని నేను చాలా నమ్మకంతో ఉన్నాను" అని కార్తీక్ ధీమా వ్యక్తం చేశారు.
దినేష్ కార్తీక్ చేసిన ఈ ప్రకటనతో దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా నిర్వహించబోయే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధతపై ఏర్పడిన సందేహాలకు తాత్కాలికంగా తెరపడినట్టయింది. తన అద్భుతమైన ఫిట్‌నెస్, ఆటపై తిరుగులేని అంకితభావంతో, కింగ్ కోహ్లీ మరోసారి మెగా టోర్నమెంట్‌లో భారత్‌కు కీలకంగా మారడానికి సిద్ధమవుతున్నాడు.