టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించిన కెప్టెన్ ధోనిని టీమిండియా నుంచి సాగనంపడానికి రంగం సిధ్దమైంది. ధోని వారసుడిగా టెస్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీకి త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో కూడా విరాట్ కోహ్లీకి పూర్తిస్థాయిలో కెప్టెన్సీ ఇవ్వడానికి సెలక్టర్లు మొగ్గుతున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగే సిరిస్‌కు టీమిండియా అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 7 వరకు 72 రోజుల పాటు ఆదేశంలో పర్యటించనుంది. దక్షిణాఫ్రికాతో టీమిండియా ఐదు వన్డేలు, మూడు ట్వంటీ 20 మ్యాచ్‌లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరిస్‌కు ధోని స్ధానంలో కోహ్లీని నియమించే అవకాశముంది.

దక్షిణాఫ్రికా సిరిస్‌కు సెప్టెంబర్ 15వ తేదీన బీసీసీఐ టీమిండియా జట్టును ఎంపిక చేయనుంది. ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా ధోని ఉన్నారు. కొత్తతరానికి కెప్టెన్సీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో టెస్టుల్లో విరాట్ కోహ్లీకి పగ్గాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్‌లో విరాట్ కోహ్లీ తానెంటో నిరూపించుకున్నాడు.
ఒకే జట్టుకు ఇద్దరు కెప్టెన్లను ఎంపిక చేస్తే, ఆ ప్రభావం ఆటగాళ్లపై పడుతుందనే భావనలో బీసీసీఐ సెలక్టర్లు ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీని దక్షిణాఫ్రికా పర్యటనకు పూర్తి స్ధాయి కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వాలని సెలెక్టర్లు ఆ దిశగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
దీంతో పాటు వచ్చే సంవత్సరం జరిగే ట్వంటీ 20 ప్రపంచకప్ వరకూ వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినివ్వాలని ఇప్పటికే బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. దీనిని బట్టి ధోనిని కేవలం ట్వంటీ20 ఫార్మెట్‌కు పరిమితం చేసి వన్డే, టెస్టులకు కెప్టెన్‌గా కోహ్లీని కొనసాగించే భావనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.