
ఇటీవల బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో నిరాశ ఎదురైంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ఫార్మాట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఏడో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 747 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గతంలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లోనే కోహ్లీ టాప్ 5 నుంచి కిందకి పడిపోయాడు. శ్రీలంకకు చెందిన కరుణరత్నే, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 7, 8 స్థానాలకు ఎగబాకారు. కాగా మరో టీమిండియా రోహిత్‌శర్మ మాత్రం తన స్థానంలో ఎలాంటి మార్పు లేకుండా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ ఖాతాలో 789 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుశేన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 915 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఉన్నాడు. కాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానం నుంచి నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఆరో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నాడు. పదో స్థానంలో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావియస్ హెడ్ ఉండగా.. పదకొండో స్థానంలో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. అలాగే టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 16వ స్థానానికి పడిపోయాడు.
ఇక బౌలింగ్ ర్యాంకుల విషయానికొస్తే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 902 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా 873 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో పాకిస్థాన్ పేసర్ షాహీన్ ఆఫ్రీదీ, నాలుగో స్థానంలో న్యూజిలాండ్ పేసర్ టీమ్ సౌథీ ఉన్నారు. ఐదో స్థానంలో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు.
ఇక టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ తమ ర్యాంకులను మెరుగు పరచుకున్నారు. 781 రేటింగ్ పాయింట్లతో బుమ్రా తొమ్మిదో స్తానంలో ఉండగా.. 810 రేటింగ్ పాయింట్లతో రబాడ ఆరో స్తానంలో ఉన్నాడు. దీంతో బుమ్రా టాప్ 10లోకి అడుగుపెట్టాడు. ఇక ఏడో స్తానంలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్‌వుడ్, ఎనిమిదో స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ వాగ్నర్ ఉన్నారు. పదో స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు.