హైదరాబాద్: తన కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కోహ్లీసేన అరుదైన బహుమతి ఇచ్చింది. భారత జట్టు తరుపున నాలుగో వన్డేకి ముందు ఈ బహుమతిని విరాట్ కోహ్లీ అందజేశాడు. ఇంతకీ అతడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? అది ఓ ప్లాటినమ్ బ్యాట్.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్‌కు ముందు ధోనికి ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఇదే మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్‌కు కోచ్ రవిశాస్త్రి టీమ్ క్యాప్ అందించాడు. అనంతరం ధోనికి విరాట్ కోహ్లీ బహుమతి ఇచ్చాడు. కొలంబో వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం ప్రారంభమైన నాలుగో వన్డే ధోనికి 300వ వన్డే.
ఈ వన్డే ద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా ధోని నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్(463), రాహుల్ ద్రవిడ్(344), మహమ్మద్ అజారుద్దీన్(334), సౌరవ్ గంగూలీ(311), యువరాజ్ సింగ్(302)లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.
ఇక అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే.. 300 వన్డేలను పూర్తి చేసుకోబోతున్న 20వ ఆటగాడిగా ధోని నిలిచాడు. ఇక భారత్ తరుపున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 463 వన్డే మ్యాచ్‌లు ఆడి.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. సచిన్ తర్వాత ప్రపంచ క్రికెట్‌లో మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే 448 వన్డేలతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత కూడా శ్రీలంక ధిగ్గజాలే ఉన్నారు. జయసూర్య 445 వన్డేలు, సంగాకర 404 వన్డేలు ఆడారు. వీరు నలుగురు మాత్రమే నాలుగు వందలకు పైగా వన్డే మ్యాచ్‌లను ఆడారు. కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న ధోనికి మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వీడియోతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 'ధోనీ.. నువ్వు ఎప్పటికీ మాకు కెప్టెన్‌వే' అని కోహ్లీ ప్రశంసించాడు.