రహానే కెప్టెన్సీపై కోహ్లీ ప్రశంసలు.. సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్ ఏమన్నారంటే?

న్యూఢిల్లీ: మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విక్టరీని సొంతం చేసుకున్నది. మొదటి టెస్టులో పరాభవం పాలై, రెండో టెస్టులో పుంజుకొని అన్ని రంగాల్లో ఆదిపత్యం చలాయించి ఘనవిజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీనియర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మొహ్మద్ షమీ, ఇశాంత్ శర్మ అందుబాటులో లేకపోయినా.. రహానే జట్టును ముందుండి నడిపించిన విధానం.. బౌలర్లను సద్వినియోగం చేసుకున్న తీరు అద్భుతమని మాజీ ఆటగాళ్లు పేర్కొన్నారు.
ఇది అద్భుత విజయం: కోహ్లీ
ఈ గెలుపుపై విరాట్ కోహ్లీ స్పందించాడు. తన ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యాడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై గెలవడం అద్భుతమన్నాడు. టీమిండియా శ్రమించిన తీరు అనిర్వచనీయమని కోహ్లీ ట్వీట్ చేశాడు. 'ఇది అద్భుతమైన విజయం. జట్టు సమష్టి కృషికి దక్కిన ఫలితం. సభ్యుల ఆట తీరు, ముఖ్యంగా అజింక్య రహానే జట్టును నడిపించిన విధానం ప్రశంసనీయం' అని పేర్కొన్నాడు. ఇక నుంచి భారత్ జైత్రయాత్ర కొనసాగాలని బైసెప్స్‌తో పాటు ఇండియా జెండా ఎమోజీలను కోహ్లీ ట్వీట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు రెండవ ఇన్నింగ్స్‌లోనూ నాటౌట్‌గా నిలిచిన రహానేకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
వెల్‌డన్ టీమిండియా: సచిన్
'మొదటి టెస్టులో ఓటమితో వెనుకబడి సిరీస్‌ను సమం చేసేందుకు జట్టు చూపిన తెగువ ఎంతగానో ఆకట్టుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇశాంత్ శర్మ, మొహ్మద్ షమీ లేకుండా టెస్టు మ్యాచ్‌లో మీరు సాధించిన విజయం ఎంతో ప్రత్యేకమైనది. వెల్‌డన్ టీమిండియా' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీటాడు. 'ఈ విజయంలో ఎన్నో సానుకూలంశాలున్నాయి. జట్టును రహానే అద్భుతంగా నడిపించాడు. బౌలర్లు మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన ఇద్దరి ఆట ఎంతో ఆకట్టుకుంది. ఆత్మవిశ్వాసంతో వారు ఆడిన విధానం ప్రశంసనీయం' అని హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.

సెహ్వాగ్, రోహిత్ ఏమన్నారంటే
'మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ విజయం అపూర్వమైనది. రహానె జట్టును ముందుండి నడిపించాడు. బౌలర్లు విధ్వంసం సృష్టించారు. గిల్ ఆకట్టుకున్నాడు' మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
'మరిచిపోలేని విజయం. సీనియర్లు అందుబాలులో లేనప్పటికీ భారత జట్టు ఆడిన నాణ్యమైన ఆట ఆకట్టుకుంది. విదేశాల్లో గొప్పగా గెలిచిన మ్యాచుల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. రహానెతో పాటు జట్టుకు శుభాకాంక్షలు' అని వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.
'మెల్‌బోర్న్‌లో టీమిండియాకు అద్భుత విజయం దక్కింది. మ్యాచ్ మొత్తంలో ఆటగాళ్ల పట్టుదల, అంకితభావం చూడముచ్చటగా అనిపించాయి' అని ఓపెనర్ రోహిత్ శర్మ ట్వీటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కోహ్లీ, రహానే కెప్టెన్సీలో తేడా అదే: రవిశాస్త్రి