న్యూఢిల్లీ : కోట్ల మంది ఆరాధించే క్రికెటర్లకు సైతం.. తమ అభిమాన క్రికెటర్ మరెవరో ఉండే ఉంటారు. ఇదే తరహాలో.. మైదానంలో రన్ మెషీన్ లా అగుపించే టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన అభిమాన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.
విండీస్ తో జరుగుతోన్న రెండో టెస్టు నాలుగో రోజున వరుణుడు మ్యాచ్ కు అడ్డు తగలడంతో.. దొరికిన విరామాన్ని సోషల్ మీడియాలో ఇలా ఫోటోలు షేర్ చేస్తూ గడిపినట్లున్నాడు విరాట్ కోహ్లి . మంగళవారం నాడు రెండు ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు కోహ్లి.
అందులో ఒకటి చిన్నతనంలో సహచర మిత్రులతో కలిసి ద్రావిడ్ తో దిగిన ఫోటో కాగా..! మరొకటి టీమ్ ఇండియాకు టెస్టు కెప్టెన్ అయ్యాక అదే ద్రావిడ్ తో మరో ఫోటో. 'ఎక్కడున్నా సరే ఇలాంటి సందర్బాలు మనల్ని గొప్ప అనుభూతికి లోను చేస్తాయంటూ' ఫోటోలకు తన కామెంట్ ను జతచేశాడు కోహ్లి.
మొత్తానికి ఇండియన్ లెజండరీ క్రికెటర్స్ లో ఒకరైన ద్రావిడ్ పట్ల తన అభిమానాన్ని ఇలా ట్విట్టర్ ద్వారా చాటుకున్నాడు కోహ్లి. అప్పట్లో టీమ్ ఇండియాకు టెస్టుల్లో ద్రావిడ్ 'వాల్' లా నిలబడితే.. ఇప్పుడు కోహ్లి కూడా తనదైన శైలిలో అధ్బతమైన ఫామ్ ను కనబరుస్తున్నాడు. కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ ను కొనసాగిస్తోన్న కోహ్లి.. విండీస్ తో మొదటి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.