
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ పర్యటనలో పూర్తిగా విఫలమయిన విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్లలో కలిపి 11 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 218 పరుగులే చేసాడు. ఇక రెండు టెస్టుల సిరీస్‌లోనైతే మరీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 38 పరుగులే చేశాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో కోహ్లీ ఈ తరహాలో ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ విఫలమవ్వలేదు. దీంతో.. కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గురువారం రాత్రి విరాట్ కోహ్లీ తన ట్విటర్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసాడు. 'మార్పు మాత్రమే శాశ్వతం' అని విరాట్ రాసుకోచ్చాడు. తలదించుకొని చేతుల్లో సెల్‌ఫోన్ చూస్తున్నట్టుగా ఓ ఫొటోను పోస్టుకు జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూజిలాండ్ సిరీసులో విఫలమవ్వడం, అతి త్వరలో దక్షిణాఫ్రికా సిరీస్ జరుగుతుండటంతో కోహ్లీ ట్వీట్‌పై ఫాన్స్ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
'తలైవా.. స్టైల్‌గా ఉన్నావ్. అందరూ నిన్నే నిందిస్తున్నారు. నేనైతే నీ పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నా. ఒక స్థాయిలో ఆడి విమర్శకుల నోళ్లు మూయించాలి' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'నువ్ చెప్పింది నిజం కోహ్లీ. మార్పు అవసరం. 2014లో ఇంగ్లండ్ గడ్డపై విఫలమయిన తర్వాత ఎలా రెచ్చిపోయావో అలా ఆడాలి' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'కోహ్లీ నీ బ్యాటింగ్, దూకుడు, షాట్లు మేం మిస్సయ్యాం. మరోసారి మునుపటిలా ఆడవా' అని ట్వీట్లు పెడుతున్నారు.
ఈ నెల 12 నుండి దక్షిణాఫ్రికా సిరీస్ ఉంది. మరోవైపు ఆసియా లెవెన్, వరల్డ్ లెవెన్ మ్యాచులు ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ ఉంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కోహ్లీ నడిపించనున్నాడు. సొంత గడ్డపై జరిగే దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాడిలో పడి ఐపీఎల్‌కు వెళ్లాలని కోహ్లీ చూస్తున్నాడు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ అమ్మాయిలకు అభినందనలు తెలిపాడు. 'సెమీఫైనల్ చేరిన భారత మహిళల జట్టుకు అభినందనలు. మీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం. ఫైనల్లో కూడా మీ జోరు కొనసాగాలి' అని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు.