హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు ముందు కాస్తంత విరామం లభించడంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూయార్క్ నగర వీధుల్లో వీరిద్దరూ చక్కెర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లాండ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండిస్‌తో ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడింది. ఐదు వన్డేల సిరిస్‌ను 3-1తేడాతో కైవసం చేసుకుంది.
ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20లో కోహ్లీసేన ఓటమి పాలైంది. విండిస్ పర్యటన ముగిసిన అనంతరం కోహ్లీ నేరుగా అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనలో ఉన్న కోహ్లీ "నా లవ్‌తో బ్రేక్ ఎంతైనా అవసరం" అంటూ ఇనిస్టాగ్రామ్‌లో అనుష్కతో కలిసి ఉన్న ఓ ఫోటోను పోస్టు చేశాడు.
ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అయితే కోహ్లీ, అనుష్క ఉన్నట్టుండి సడన్‌గా న్యూయార్క్‌కి ఎందుకెళ్లారా? అన్న సందేహాం అభిమానుల్లో కలిగింది. అయితే న్యూయార్క్‌లో జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం నిమిత్తం బాలీవుడ్ నటి అనుష్క అక్కడికి వెళ్లింది. జులై 15న న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఐఫా ఈవెంట్ జరగనుంది.
మరోవైపు వెస్టిండిస్ పర్యటన ముగించుకుని విరాట్ కోహ్లీ నేరుగా కరేబియన్ నుంచే అమెరికాలోని న్యూయార్క్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో తన ప్రేయసి అనుష్క శర్మతో చక్కెర్లు కొడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు అనుష్క సైతం న్యూయార్క్‌లో తాను ఉంటున్న బస చేసిన ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.