ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ (57; 35 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైశ్వాల్ (68; 34 బంతుల్లో), శివమ్ దూబె (63*; 32 బంతుల్లో) మెరుపు అర్ధశతకాలు సాధించారు. విరాట్ కోహ్లి (29; 16 బంతుల్లో) రాణించాడు. రోహిత్ డకౌటయ్యాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో కరీమ్ రెండు వికెట్లు, నవీనుల్, ఫరూకీ చెరో వికెట్ తీశారు.

అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కోసం ఓ అభిమాని సాహసం చేశాడు. సెక్యూరిటీ కళ్లు కప్పి మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చాడు. బౌండరీలైన్ వద్ద ఉన్న కోహ్లిని కలుసుకునేందుకు అమితానందంగా పరిగెత్తూ వచ్చాడు. దీంతో ఆ అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు పంపించాలని కోహ్లి భావించాడు. కానీ అతడు కోహ్లి కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే కోహ్లి అలా చేయిద్దని సింబాలిక్‌గా చెబుతూ ఆ ఫ్యాన్‌కు హగ్ ఇచ్చాడు. ఈ లోపు వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని తీసుకొని వెళ్లారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే కోహ్లిని కలుసుకోవడానికి తన అభిమానులు మైదానంలోకి రావడం ఇదేం కొత్త కాదు. భారత్‌లో పాటు విదేశాల్లోనూ కోహ్లి కోసం తన ఫ్యాన్స్ ఇలా సాహసాలు చేస్తూనే ఉంటారు. మరోవైపు 14 నెలల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి సత్తాచాటాడు. ఫార్మాట్‌ను బట్టి గేర్‌లు మారుస్తానంటూ ఆది నుంచే దూకుడుగా ఆడాడు.
ముచ్చటైన షాట్లతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో స్టైల్‌గా అయిదు బౌండరీలు బాదాడు.అయితే కోహ్లి నిదానంగా ఆడతాడని, టీ20 ఫార్మాట్‌లో అది జట్టుకు బలహీనంగా మారుతుందని గతంలో కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కానీ వారి విమర్శలకు కోహ్లి బ్యాటుతోనే సమాధానం చెప్పాడు.