
హైదరాబాద్: చావో రేవో అనే రీతిలో తయారైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ మొదలు ప్రతి మ్యాచ్‌లోనూ గెలిస్తేనే బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన కోహ్లీ అండ్ టీమ్ సరదాగా సహచర ఆటగాడైన మొహమ్మద్ సిరాజ్ ఇంటికి వెళ్లింది. ఇంటికి వచ్చిన అతిథులకు సిరాజ్ హైదరాబాదీ బిర్యానీ రుచి చూపించాడు. సిరాజ్ ఇప్పుడు బెంగళూరు టీమ్‌లో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.
కోహ్లితోపాటు ఇతర ప్లేయర్లంతా బిర్యానీ టేస్ట్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆదివారం రాత్రి పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్‌ను టీవీలో చూస్తూ కోహ్లి టీమ్ డిన్నర్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ కొడుకైన మొహమ్మద్ సిరాజ్ ఇంట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆతిథ్యం అందుకోవడం ఓ కలలా ఉందని స్థానికులు చెప్తున్నారు. బంజారా హిల్స్ ప్రాంతంలో రెండు గదుల ఇంట్లో నివావసముండే ఆ కుటుంబం ఇప్పుడు టోలీ చౌకీ వద్ద కొత్త ఇంట్లో నివాసముంటుంది.
ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న బెంగళూరు టీమ్‌కు సన్‌రైజర్స్‌తో మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఇందులో గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. 9 మ్యాచుల్లో కేవలం మూడింట్లోనే గెలిచి ఆరోస్థానంలో ఉంది కోహ్లి టీమ్. మరోవైపు అన్నే మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ ఏడు విజయాలు సాధించి ప్లేఆఫ్‌పై కన్నేసింది.
సోమవారం జరగబోయే మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ చేరిన తొలి టీమ్‌గా హైదరాబాద్ నిలుస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాతి మ్యాచ్‌లను ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌తోనూ ఆడనుంది.