హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా అనేక విజయాలను సైతం టీమిండియాకు అందించాడు. భారత క్రికెట్ అభిమానులు సైతం విరాట్ కోహ్లీని ఆరాధిస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అనేక రికార్డులను సైతం కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో సచిన్ వారసుడిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు. అయితే, వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం విరాట్ కోహ్లీ కంటే సచిన్ టెండూల్కరే తన ఆల్‌టైమ్ ఫేవరేట్ బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు.
డీవై పాటిల్ యూనివర్శిటీలో జరిగిన డాక్టరేట్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన లారాకు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లారా సమాధానమిచ్చాడు. ఇందులో భాగంగా ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు సచిన్ టెండూల్కరే తన ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అని బదులిచ్చాడు. క్రికెట్ అనే గేమ్‌పై సచిన్ ఓ చెరగని ముద్ర వేశాడని పేర్కొన్నాడు.
"సచిన్ ఆడిన కాలంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. భారత ఆటగాళ్లు విదేశీ పిచ్‌లపై ఆడలేరనే అపవాదు ఉండేదో దాన్ని సచిన్ చెరిపేశాడు. ప్రపంచ క్రికెట్లో ఉన్న ప్రతీ పిచ్‌పై సచిన్ మెరిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దాని కొనసాగింపే ప్రస్తుత భారత క్రికెటర్లు ప్రతీ చోట రాణించడానికి కారణం. సచిన్ అనే పుస్తకంలో ఒక పేజీ మాత్రమే మిగతా క్రికెటర్లు" అని లారా అన్నాడు.