ఫోర్బ్స్ జాబితా: భారత్ నుంచి 'ఒకే ఒక్కడు' కోహ్లీ, మహిళలకు దక్కని చోటు


హైదరాబాద్: ప్రపంచంలో అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు లభించింది. అంతేకాదు భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ఆటగాడు విరాట్ కోహ్లీనే.
గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

83వ స్థానంలో విరాట్ కోహ్లీ
24 మిలియన్ల డాలర్ల ఆదాయంతో ఫోర్బ్స్ జాబితాలో కోహ్లీ 83వ స్థానంలో నిలిచాడు. 4 మిలియన్ల డాలర్లను వేతనంగా అందుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మిగతా 20 మిలియన్ డాలర్లను వ్యాపార ప్రకటనల ఒప్పందాల ద్వారా సంపాదిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ సెంటర్లు, బ్రాండెడ్ దుస్తులు, ఫుట్‌బాల్, టెన్నిస్ ఫ్రాంచైజీలు, ఆడియో ఎక్విప్‌మెంట్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

అగ్రస్థానంలో అమెరికా బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయడ్ మేవెదర్
ఈ జాబితాలో అమెరికాకు చెందిన బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయడ్ మేవెదర్ 285 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(111 మిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలవగా, పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(108 మిలియన్ డాలర్లు)తో మూడో స్థానంలో నిలిచాడు.

టాప్-100 జాబితాలో NBAకు చెందిన 40 మంది ప్లేయర్లు
గత ఏడేళ్లల్లో ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో ఫ్లాయడ్ అగ్రస్థానం దక్కించుకోవడం ఇది నాలుగోసారి. టాప్-100 జాబితాలో NBAకు చెందిన 40 మంది బాస్కెట్ బాల్ ప్లేయర్లు చోటు దక్కించుకోవడం విశేషం. ఒకే ఆట నుంచి ఇంత మంది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి.

ఒకే ఆటకు చెందిన ఆటగాళ్లు సంఖ్య 18
2016లో ప్రకటించిన జాబితాలో ఒకే ఆటకు చెందిన ఆటగాళ్లు సంఖ్య 18గా ఉంది. అయితే 2016-17 సీజన్‌లో NBA ఆటగాళ్లు వేతనాలు ఒక్కసారిగా పెరగడంతో ఈ జాబితాలో పెద్ద మొత్తంలో వారికి చోటు లభించింది. గతేడాది 22 మిలియన్ డాలర్ల ఆదాయంతో 89వ స్థానంలో నిలిచిన కోహ్లీ ఈ ఏడాది తన స్థానాన్ని మెరగుపరచుకున్నాడు.

టాప్-100 జాబితాలో కనిపించని మహిళలు
కాగా, ఈ ఏడాది టాప్-100 జాబితాలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. గత ఏడాది అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో ఆమె కొన్నాళ్లు ఆటకు దూరమైంది. దీంతో ఆమె తాజా జాబితాలో చోటు దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications