హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతోంది. ఓపెనర్ అభినవ్ ముకుంద్ డకౌట్‌గా వెనుదిరగడంతో టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఛటేశ్వర్ పుజారా 17 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.
కెప్టెన్ కోహ్లీ కూడా అభిమానులను నిరాశపరిచాడు. పూణె టెస్టులో స్పిన్నర్‌ను అంచనా వేయలేకపోయిన కోహ్లీ ఈసారి బెంగుళూరు టెస్టులో కూడా అలాంటి పొరపాటే చేశాడు. లియాన్ వేసిన 33.5వ బంతికి విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. లియాన్ వేసిన ఆఫ్‌బ్రేక్ బంతిని కోహ్లీ వదిలేశాడు.
వాస్తవానికి బంతి స్పిన్ తిరుగుతుందని భావించిన కోహ్లీ బ్యాట్ పైకెత్తాడు. అయితే బంతి తిరగకుండా నేరుగా వచ్చి కోహ్లీ ప్యాడ్లను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. దీంతో చిన్నసామి స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అంపైర్ రివ్వ్యూకు వెళ్లిన కోహ్లీకి నిరాశే ఎదురైంది.

మొదటి సెషన్‌లో రెండో వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. లంచ్ విరామ అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీని ఆస్ట్రేలియా బౌలర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్యాన్స్ మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన కోహ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. 31వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ పదునైన బౌన్సర్లు, గుడ్‌లెంగ్త్ బంతులతో కోహ్లీని లక్ష్యంగా చేసుకున్నాడు.
ఆ తర్వాత 33వ ఓవర్‌లో లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే టీ విరామానికి 5 వికెట్లను కోల్పోయిన భారత్ 168 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు.