కోహ్లీతో మాట్లాడాకే: సీఏసీ తెలివైన నిర్ణయం, కుంబ్లేలా కాకూడదనే!
హైదరాబాద్: టీమిండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సోమవారం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తి చేసినప్పటికీ కొత్త కోచ్ ఎవరనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.
'కోచ్ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు' అని గంగూలీ స్పష్టం చేశారు.
టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్, రిచర్డ్ పైబస్‌లు సోమవారం ఇంటర్వ్యూకు హాజరయ్యారు. క్రికెట్ సలహా కమిటీలో సభ్యులు గంగూలీతో పాటు వీవీఎస్ లక్ష్మణ్‌లు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి రాగా, లండన్‌లో ఉన్న సచిన్.. స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొన్నాడు.
రవిశాస్త్రి, సెహ్వాగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ (భారత్), టామ్ మూడీ (ఆస్ట్రేలియా), రిచర్డ్ పైబస్ (దక్షిణాఫ్రికా)లు తమ శిక్షణ, ప్రణాళికల గురించి వివరించారు. మరో అభ్యర్థి ఫిల్ సిమన్స్ (విండీస్) మాత్రం ఇంటర్వ్యూకు హాజరు కాలేదు. సెహ్వాగ్ ఇంటర్వ్యూ రెండు గంటలకు పైగా సాగింది. అభ్యర్థుల ప్రజెంటేషన్ విషయంలో గతేడాది మాదిరే సాగిందని గంగూలీ చెప్పారు.

కోహ్లీ అభిప్రాయం కూడా ముఖ్యం
‘భారత క్రికెట్ భవిష్యత్తు గురించి అభ్యర్థులు చెప్పిన విషయాలు, ఆలోచనలు గతంలో చూసినవే. నేను గానీ బోర్డు కార్యదర్శి లేదా సీఈఓ గానీ మ్యాచ్ బరిలోకి దిగేవాళ్లం కాదు. అందరికంటే ఆటగాళ్లు ముఖ్యం. వారికి సహాయక సిబ్బంది అండగా ఉంటారు. అయితే అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటే బాగుంటుంది. భారత క్రికెట్ మేలు గురించి ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం' అని అన్నారు. కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియలో కెప్టెన్ కోహ్లీ అభిప్రాయం కూడా ముఖ్యమని గంగూలీ స్పష్టం చేశాడు.

కోచ్‌లు ఎలా పనిచేస్తారన్నది కోహ్లీ అర్ధం చేసుకోవాలి
'కోచ్‌లు ఎలా పని చేస్తారన్నది కోహ్లీ అర్థం చేసుకోవాలి. అదే సమయంలో కోచ్ సెలక్షన్ ప్రక్రియకు దూరంగా ఉన్నందుకు అతన్ని అభినందించాలి. వెస్టిండీస్ నుంచి తిరిగొచ్చాక అతడితో మేం దీనిపై మాట్లాడాలి అనుకుంటున్నాం' అని గంగూలీ చెప్పాడు. కోహ్లి-కుంబ్లే వివాదాన్ని సీఏసీ తీవ్రంగా తీసుకుంటుందని గంగూలీ మాటల్ని బట్టి అర్థమవుతోంది. కోహ్లీతో తీవ్ర స్థాయి విభేదాల నేపథ్యంలో కోచ్ పదవి నుంచి కుంబ్లే వైదొలగిన సంగతి తెలిసిందే. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కొత్త కోచ్‌పై ప్రకటనను వాయిదా వేశారని అమితాబ్ చౌదరి అన్నాడు.

రవిశాస్త్రికి కష్టమే
'ప్రతి కోచ్‌కు ఒక శైలి ఉంటుంది. ప్రతి ప్రొఫెషనల్ ఓ శైలి కలిగి ఉంటాడు. సంబంధించిన అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకునేలా చేయడం కోసమే సీఏసీ వాయిదా నిర్ణయం తీసుకుంది' అని అమితాబ్ చౌదరి వివరించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కోహ్లీ జులై 17న భారత్‌కు తిరిగ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇంటర్వ్యూకు ముందు వరకు కూడా టీమిండియా డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రినే కోచ్‌గా ఎంపికవుతారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తుంటే అలా కనిపించడం లేదు.

కోహ్లీ ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు
కోచ్ పేరును నేరుగా ప్రకటించకుండా కోహ్లీని అందులో భాగస్వామిని చేయడం అనేది సీఏసీ తెలివిగా వ్యవహరించిన నిర్ణయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ఇది పూర్తిగా తమ నిర్ణయం కాదని, రేపు కుంబ్లే తరహాలో ఏదైనా జరిగితే కోహ్లీనే బాధ్యత వహించాలని క్రికెట్ సలహా కమిటీ సూచాయగా చెప్పినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు బీసీసీఐలోని ఒక వర్గం చెబుతున్న ప్రకారం... కోహ్లీ ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచి అందులో ఒకరిని ఎంపిక చేసుకోమని కోరుతున్నట్లు సమాచారం. అయితే అందులో శాస్త్రి పేరు కాకుండా సెహ్వాగ్, టామ్ మూడీ పేర్లు ఉన్నాయని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications