బెంగళూరు: వచ్చీరావడంతోనే బిసిసిఐ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే భారత క్రికెటర్లపై ప్రయోగాలు ప్రారంభించాడు. అతనో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. క్రికెటర్లకు బంతులు, బ్యాట్లు ఇవ్వడానికి బదులు డ్రమ్ములు ఇచ్చి వాయించాలని చెప్పాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆ సంగీత సాధన జరిగింది.
సంగీత విద్వాంసురాలు వసుంధరా దాస్ సారథ్యంలో క్రికెటర్లంతా డ్రమ్ జామ్ చేశారు. దీనివల్ల జట్టులో స్ఫూర్తి పెరగడమే కాకుండా వినోదం పొందడానికి కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు.ఈ డ్రమ్‌జామ్ కార్యక్రమంలో కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీ సహా ప్రస్తుత జట్టు సభ్యులంతా పాల్గొన్నారు.

ఈ సంగీత కార్యక్రమాన్ని క్రికెటర్లు వినోదిస్తున్న ఫొటోను బిసిసిఐ విడుదల చేసింది. సంగీత విద్వాంసురాలైన వసుంధర హే రామ్, మీరా నాయర్ మాన్సూన్ వెడ్డింగ్ చిత్రాల్లో నటించింది. ఆదివారం నిర్వహించిన ఆ కార్యక్రమాన్ని డ్రమ్ సర్కిల్‌గా పిలుస్తారు.

కొంత మంది గుమిగూడి అందరూ కలిసి డ్రమ్స్ వాయిస్తారు. డ్రమ్ సర్కిల్‌లో రిథమ్ ఉంటుంది. జట్టు సమగ్రత, ఐక్యత దీని వల్ల పెరుగుతుందని అంటున్నారు. గ్రూప్ కమ్యూనికేషన్‌ను ఇది పెంచుతుంది. బడ్డీ ప్రాజెక్టు వంటి ప్రయోగాలు కూడా కుంబ్లే చేయబోతున్నట్లు సమాచారం.