పుణె: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పుణెలోని ఓ వృద్ధాశ్రమానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఏబీఐఎల్ స్వచ్ఛంద సంస్థతో కలిసి స్థానిక ఆభాల్మాయ వృద్ధాశ్రమానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవనున్నట్లు ప్రకటించాడు.
గురువారం ఆశ్రమంలోని వృద్ధులను కోహ్లీ ప్రత్యక్షంగా కలిశాడు. వారికి మొదట నమస్కరించి నవ్వుతూ కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా కోహ్లీ మట్లాడుతూ.. ఆశ్రమ నిర్వాహకులు గొప్ప పని చేస్తున్నారని ప్రశంసించారు.
కుటుంబంలోని పెద్దవాళ్ల బాగోగులు చూసుకోవడం మన కనీస బాధ్యత అని, దాన్ని విస్మరించడం చాలా పెద్ద తప్పు అని విరాట్ కోహ్లి ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

ఇది ఇలా ఉండగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన వంతు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మురికివాడల్లోని సమస్యల పరిష్కారం కోసం సచిన్.. ముంబై మహానగరపాలిక అధికారులతో సమావేశయ్యాడు. దేవనార్ డంపింగ్ యార్డు సమీపంలో నివసిస్తున్న జనం పడుతున్న బాధల గురించి నెల క్రితం అతడు నగరపాలికకు లేఖ రాశాడు.
ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కమిషనర్‌తో సచిన్ తాజా సమావేశం జరిగింది. పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించటం.. వారి అలవాట్లలో మార్పులు తీసుకురావడం గురించి సచిన్ అధికారులతో చర్చించాడు. చెత్త తరలింపు, వ్యర్థాల నిర్వహణలో ముంబై ఇతర నగరాలకు ఆదర్శంగా నిలవాలని.. అందుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.