
హైదరాబాద్: ఎవరికీ తెలియకుండా.. మీడియా కంట పడకుండా ఎలాంటి హడావుడి లేని ప్రశాంతమైన వాతావరణంలో.. ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు కోహ్లి, అనుష్క. అయితే వారు ఈ వివాహ వేదిక కోసం ఎన్నో నెలల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది.
పెళ్లి వేదిక బోర్గో ఫినోచియెటోను విరుష్క ఇష్టపడి ఎంపిక చేసుకున్నారట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన రిసార్ట్‌లతో కూడిన ఫోర్బ్స్ జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది. టస్కనీకి 100 కిలోమీటర్ల దూరంలో 800 ఏళ్ల క్రితం నిర్మితమైన గ్రామంలో ఈ రిసార్ట్ ఉంది.
విలాసవంతమైన బంగ్లాలతో కూడిన ఈ రిసార్ట్‌ను ఓ వారం పాటు అద్దెకు తీసుకోవాలంటే అయ్యే ఖర్చు దాదాపుగా రూ. 95 లక్షలు . రిసార్ట్ మాత్రమే కాదు.. ఇంత ఖర్చు పెట్టిన వాడు పెళ్లి ఉంగరం విషయంలో తగ్గుతాడా.. అక్కడ కూడా ఏమాత్రం తగ్గలేదు. వేదిక అద్దె కంటే ఎక్కువే వెచ్చించి అతడు ఉంగరాన్ని కొన్నాడట.
అరుదైన వజ్రంతో తయారుచేసిన ఉంగరానికి అతడు రూ. కోటికి పైనే ఖర్చు చేశాడని బాలీవుడ్ వర్గాలు సంబ్రమాశ్చర్యాలకు గురైయ్యాయి. ఉంగరం ఎంపిక కోసం కోహ్లీకి మూడు నెలల సమయం పట్టిందట. ఎటువైపు నుంచి చూసినా భిన్నంగా కనిపించే ఈ ఖరీదైన ఉంగరాన్ని ఆస్ట్రియాలోని ప్రముఖ డిజైనర్ రూపొందించాడట. పెళ్లిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఇద్దరు ఉంగరాలను మార్చుకున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.