
హైదరాబాద్: కెరీర్‌లో ఎదిగేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకున్నానని యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ అంటున్నాడు. తాను అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు విరాట్ కోహ్లీ సాయపడ్డాడని చాహల్ తెలిపాడు. కొద్దిరోజులుగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని అంచలంచెలుగా టెస్టు జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ దళంలో కీలక ఆటగాడు చాహల్. ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ గౌరవ్ కపూర్ నిర్వహిస్తోన్న 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్' షోలో చాహల్ మాట్లాడుతూ.. తాను కెరీర్‌లో అత్యుత్తమంగా రాణించేందుకు విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకున్నాని వెల్లడించాడు.
విరాట్ భయ్యా చాలా స్ఫూర్తినిచ్చాడు. మైదానంలోనే కాదు బయటి విషయాల్లోనూ అతను ఎంతో సాయం చేశాడు. జీవితంలో ఎన్నో మార్పులొచ్చేందుకు కారణమైయ్యాడు. ప్రతిభ మెరుగుపరుచుకునేందుకు ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని విరాట్ చెప్పాడు. ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను తెలియజేశాడు. ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో నేను ఇప్పుడు తెలుసుకున్నా. సాధన చేసిన తరువాత కూడా చాలా ఉత్సాహంగా ఫీలవుతానని వ్యాఖ్యానించాడు.
ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ.. టీమిండియాలో సభ్యుడిగా జట్టులో తొలి వన్డే ఆడుతున్న సమయంలో ధోనీని ఏమని పిలవాలో అర్థంకాక సతమతమయ్యానని తెలిపాడు. అదే సమయంలో.. సర్ అని పిలిచినందుకు ధోనీ దగ్గరకు పిలిచి మహీ, ధోనీ, భాయ్ అని ఇష్టమొచ్చినట్లు పిలవమని అన్నాడట. సర్ అని మరోసారి పిలవొద్దంటూ సూచించాడట. ఈ విషయాన్ని వెల్లడించి జట్టుతో తనకున్న అనుబంధం గురించి పేర్కొన్నాడు.