హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని, అతడు కొట్టే షాట్లను అవతలి ఎండ్ నుంచి చూసేందుకు ఇష్టపడతానని విరాట్ కోహ్లీ అన్నాడు. కాన్పూర్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 230 పరుగులు జోడించారు. సిరిస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించగా, చివరి ఓవర్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేయడంతో మూడో వన్డేలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మలు పలు రికార్డును నమోదు చేశారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేల్లో 200కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది నాలుగోసారి. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరూ బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. ఓపెనర్‌గా జట్టుకు మంచి స్కోరు అందించడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పిన రోహిత్ చెప్పగా, కోహ్లీ దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతానని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో రనౌట్ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఇద్దరం అద్భుతంగా బ్యాటింగ్ చేశామని రోహిత్ తెలిపాడు. అంతేకాదు కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని తాను ఎప్పుడూ ఆస్వాదిస్తానని రోహిత్ శర్మ తెలిపాడు. ఇక, కోహ్లీ మాట్లాడుతూ రోహిత్ కలిసి బ్యాటింగ్ చేసేటప్పుడు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదని అన్నాడు.
ఇద్దరం ఒకరి ఆటను మరొకరం అర్ధం చేసుకుని ఆడతామని కోహ్లీ చెప్పాడు. రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని కోహ్లీ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో మీ కోసం...