
భారత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ ఒకడు. అదే సమయంలో అతని రికార్డులు బద్దలు కొట్టే మొనగాడు ఎవడైనా ఉన్నాడా? అంటే అందరూ విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. కోహ్లీ కూడా మరి అంత అద్భుతంగా ఆడాడు మరి. బంగ్లాదేశ్‌పై తన వన్డే సెంచరీ వెయిట్‌ను కూడా ముగించిన కోహ్లీ.. కొత్త ఉత్సాహంతో శ్రీలంక సిరీస్‌లో బరిలో దిగుతున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రెండు రికార్డులపై కోహ్లీ కన్నేశాడు. గువాహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా జరిగే తొలి వన్డేలోనే వీటిని కోహ్లీ చేరుకున్నా ఆశ్చర్యం లేదు.
స్వదేశంలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. అతను భారత దేశంలో 20 సెంచరీలు బాదాడు. మొత్తం 164 మ్యాచుల్లో సచిన్ ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 101 మ్యాచుల్లో 19 హోం సెంచరీలతో ఉన్నాడు. శ్రీలంకతో జరిగే తొలి వన్డేలో కనుక కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ రికార్డును సమం చేస్తాడు. గువాహతి స్టేడియంలో కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. చివరగా ఇక్కడ ఆడినప్పుడు అతను 140 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ ఈ మైలురాయి అందుకున్నా ఆశ్చర్యం లేదు.
అంతేకాదు, ఈ సిరీస్ మొత్తంలో మరో 180 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. ఈ క్రమంలో లంక లెజెండ్ మహేల జయవర్దనేను వెనక్కు నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఇదే వరుసలో మరో కోహ్లీ రికార్డు కూడా కోహ్లీకి చేరువలో నిలిచింది. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ల జాబితాలో సచిన్, కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నారు. వీళ్లిద్దరూ కూడా ఈ జట్టుపై 8 చేసి ఉన్నారు. గువాహతి మ్యాచ్‌లో కోహ్లీ మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును అధిగమించేస్తాడు.