హైదరాబాద్: భావోద్వేగాలు ఎక్కువవడం వల్లే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఆసీస్‌పై సిరిస్ నెగ్గాలనే గట్టి పట్టుదలతో కోహ్లీ ఉన్నాడని దాదా అభిప్రాయపడ్డాడు.
ఈ క్రమంలో కోహ్లీ తన భావోద్వేగాల్ని ఎక్కువగా బయటపెట్టాడని ఐసీసీ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'ఆసీస్ సిరీస్ అనేసరికి కెప్టెన్‌గా కచ్చితంగా విజయం సాధించాలన్న పట్టుదలతో కోహ్లీ తన భావోద్వేగాల్ని ఎక్కువగా బయటపెట్టాడు. అదే అతడి బ్యాటింగ్‌పై ప్రభావాన్ని చూపింది. కోహ్లీ దగ్గర విలువైన ప్రతిభ ఉంది. అతను మళ్లీ మామూలు స్థితికి వచ్చి పరుగులు సాధిస్తాడు' అని గంగూలీ పేర్కొన్నాడు.

'నాకు తెలిసి ఇద్దరు విరాట్‌లు ఉన్నారు. ఒకరు కెప్టెన్‌గా మరొకరు బ్యాట్స్‌మెన్‌గా. బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ పరుగుల వరద పారించడంతో పాటు ఫిట్‌నెస్ పరంగా ప్రపంచంలో అత్యుత్తమ రికార్డులను నమోదు చేశాడు. కెప్టెన్ విషయానికి వస్తే యువ ఆటగాళ్లకు లీడర్‌గా నిలుస్తూ మేటి కెప్టెన్' అని అనిపించుకున్నాడని దాదా తెలిపాడు.
ఒక విజయం తర్వాత మరోక విజయాన్ని గెలవాలనే పట్టుదలతో కోహ్లీ ఉన్నాడని గంగూలీ పేర్కొన్నాడు. కాగా, ఆసీస్‌తో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్ ఆద్యంతం ఉత్కంఠగా వివాదాలతో కొనసాగింది.
28 ఏళ్ల కోహ్లీ ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లాడి 1457 పరుగులు నమోదు చేసాడు. అయితే ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో కోహ్లీ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరిస్‌లో మూడు మ్యాచ్‌లాడిన కోహ్లీ 0,13,12,15,6 పరుగులు మాత్రమే చేశాడు.