
హైదరాబాద్: భారత క్రికెటర్లు జీతాలు పెంచాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డిమాండ్ చేశాడు. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ రూ. 16వేల కోట్లు ఆర్జించిన సంగతి తెలిసిందే.
రూపెర్ట్ ముర్డోచ్ నేతృత్వంలోని స్టార్ ఇండియా 2018 నుంచి 2022 కాలానికి ఐపీఎల్ హక్కులను పెద్ద మొత్తంలో చెల్లించి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జీతాలు కూడా పెంచాలని బీసీసీఐని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, ఇటీవలే కేటగిరి 1లో ఉన్న ఆటగాళ్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.2 కోట్లకు బీసీసీఐ పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎంతమాత్రం చాలదని రూ. 5 కోట్లకు పెంచాలని గత కొన్నిరోజులుగా విరాట్ కోహ్లీ బీసీసీఐతో వాదిస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలో ఆటగాళ్ల జీతాల విషయమై కొత్త కాంట్రాక్టుల కోసం బీసీసీఐ ఈ వారంలో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆటగాళ్ల జీతాల పెంపు విషయం కోహ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. సెప్టెంబర్ 30తో ఆటగాళ్ల ఒప్పందం ముగిసింది.
కొత్త కాంట్రాక్టుల కోసం కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) కూడా ఆటగాళ్లతో చర్చించనున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. కెప్టెన్ కోహ్లీతోపాటు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, కోచ్ రవిశాస్త్రి.... సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్‌తో మాట్లాడనున్నారు.
బీసీసీఐ ప్రస్తుతం ఆటగాళ్లను మూడు కేటగిరీలుగా విభజించారు. కోహ్లి, ధోనిలాంటి ప్లేయర్స్ ఫస్ట్ కేటగిరీలో ఉన్నారు. అయితే ఇక నుంచి ఈ పద్ధతిని మార్చామని, అందుకే ఆటగాళ్లతో సంప్రదిస్తున్నామని బోర్డుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఆటగాళ్ల జీతాలతోపాటు షెడ్యూల్‌పై కూడా ఈ ముగ్గురూ సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ చర్చించనున్నారని తెలిపారు. రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ దక్షిణాఫ్రికా లాంటి కీలకమైన పర్యటనకు ముందు టీమ్‌కు తగినంత సమయం ఇవ్వకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
షెడ్యూల్స్ విషయంలో కోహ్లీ చెప్పింది నిజమేనని మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ధోనిలు సైతం మద్దతుల తెలిపారు. మరోవైపు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కూడా దీనిపై త్వరలో జరిగే స్పెషల్ జనరల్ మీటింగ్‌లో చర్చిస్తామని చెప్పారు.
కాగా, ప్రస్తుతం కోహ్లీసేన శ్రీలంకతో జరుగుతున్న సిరిస్‌లో బిజీగా ఉంది. డిసెంబర్ 24తో శ్రీలంకతో సిరిస్ ముగుస్తుండగా... ఆ తర్వాత వెంటనే కోహ్లీసేన డిసెంబర్ 28న దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. జనవరి 5 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీనికి ముందు డిసెంబర్ 30న కోహ్లీసేన రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.