

హైదరాబాద్: బ్యాటింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడంతో రెండో టెస్టులో ఓటమి పాలయ్యామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50.2 ఓవర్లలో 151 పరుగులు చేసి ఆలౌటైంది.
దీంతో ఈ టెస్టులో పర్యాటక జట్టుపై అతిథ్య దక్షిణాఫ్రికా 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే దక్షిణాఫ్రికా 2-0తో సొంతం చేసుకుంది. సిరిస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
'టాస్‌కు ముందు చూసిన పిచ్, ప్రస్తుతం ఉన్న వికెట్‌కు చాలా వ్యత్యాసముందని జట్టు ఆటగాళ్లకు హెచ్చరించాను. వికెట్ చాలా ఫ్లాట్‌గా ఉంది. పరుగులు తీయడం తేలిక అని భావించాను. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా వెనువెంటనే వికెట్లు కోల్పోవడంతో పరిస్థితి అర్థమైంది. కానీ మా బ్యాటింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించలేకపోయాం' అని కోహ్లీ అన్నాడు.
ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంపై కూడా కోహ్లీ స్పందించాడు. 'సెంచరీ చేసినా లాభం లేకపోయింది. ఎందుకంటే జట్టు ఓడిపోయింది కదా. జట్టు గెలుపు కోసం చేసిన 30 లేక 50 పరుగులైనా నాకు ఆనందాన్నిస్తాయి. జట్టు గెలవని సందర్భంలో నా వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోను' అని తెలిపాడు.
'బరిలోకి దిగానంటే దేశం కోసం పూర్తిస్థాయిలో రాణించేందుకు శ్రమిస్తాను. బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ బ్యాట్స్‌మెన్ వైఫల్యాలతో సిరిస్‌ను చేజార్చుకున్నాం. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించడం వల్లే విజయం వారి సొంతమైంది. సఫారీలు టీమిండియా కంటే మెరుగ్గా ఆడారు' అని కోహ్లీ ప్రశంసించాడు.
ముఖ్యంగా ఫీల్డింగ్‌లో దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసిందని, ఈ సిరిస్ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని కోహ్లీ అన్నాడు. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు జనవరి 24న జోహెన్స్ బర్గ్ వేదికగా ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.