
మైదానంలో తన బ్యాటింగ్‌తో రికార్డులు కొల్లగొట్టే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లో ఓ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. 2021 సంవత్సరానికి గానూ గూగుల్‌లో యూజర్స్ ఎక్కువగా వెతికిన వారిలో భారత క్రీడాకారుల పరంగా విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నిలిచాడు. వీరిద్దరి తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన నీరజ్ చోప్రా ఉన్నాడు.
ప్రధాని మోదీ తర్వాత కోహ్లీ
క్రీడాకారుల పరంగా కాకుండా మొత్తంగా తీసుకుంటే భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉండడం విశేషం. కోహ్లీ కంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ ఏడాదిగానూ గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతదేశ వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. ఇక టోక్యో ఒలిపింక్స్‌లో జావెలిన్ త్రోలో భారత్‌కు బంగారు పతకం తెచ్చిన నీరజ్ చోప్రా ఈ జాబితాలో 19వ స్థానంలో నిలిచాడు.
కోహ్లీకి కలిసిరాని 2021
2021 సంవత్సరం విరాట్ కోహ్లీ కెరీర్‌లో తనకు కలిసిరాని సంవత్సరానికి నిలిచిపోనుంది. ఎందుకంటే ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ ఇటు కెప్టెన్‌గా, అటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. దీనికి తోడు ఈ ఏడాది పరిమిత ఓవర్లు క్రికెట్‌లో కోహ్లీ తన కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది. కెప్టెన్‌గా ఈ ఏడాది విరాట్ కీలక టోర్నీలను ఎదుర్కొన్నాడు. కోహ్లీ సారథ్యంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌తో తలపడింది. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అలాగే మరోక కీలక టోర్నీ అయినా టీ20 వరల్డ్‌కప్‌లో కూడా కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా ఆడింది. ఆ టోర్నీలోనూ కోహ్లీ సేనకు నిరాశ తప్పలేదు. కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండానే భారత జట్టు వెనుదిరిగింది. అంతే కాకుండా చరిత్రలో తొలిసారి ప్రపపంచకప్ టోర్నమెంట్‌లలో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. అయితే విరాట్ కెప్టెన్సీలో ఈ సారి ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడిన టీమిండియా 2-1తో అధిక్యంలో నిలిచింది. ఈ ఒక్కటే ఈ ఏడాది కోహ్లీకి మంచి జరిగిన అంశం. కానీ ఈ ఏడాది టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా సెలెక్టర్లు తప్పించారు. ఇక ఐపీఎల్‌లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకున్నాడు. అలాగే బ్యాటర్‌గా కోహ్లీకి ఈ ఏడాది ఏమంతగా కలిసిరాలేదు. ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన కోహ్లీ.. పెద్దగా పరుగులు కూడా సాధించలేకపోయాడు.