
ఆ రెండు సిక్సర్లతో మారిన ఈక్వేషన్స్
పాకిస్తాన్‌పై భారత్ గెలవాలంటే చివరి 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశ అది. విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్రీజ్‌లో ఉండటం వల్ల విజయం భారత్‌నే వరిస్తుందనే ఆశ అభిమానుల్లో నెలకొంది. 19వ ఓవర్‌లో గేర్ మారిస్తే గానీ విజయం దక్కదనే విషయం వారిద్దరికీ తెలుసు. స్టార్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సంధించిన ఓవర్ అది. పైగా ఆ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో వచ్చింది మూడు పరుగులే. ఆ తరువాత కోహ్లీ విజృంభించాడు. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీనితో ఈక్వేషన్స్ మారిపోయాయి.

కింగ్ ఆఫ్ ఛేజింగ్..
ఈ మ్యాచ్ తరువాత విరాట్ కోహ్లీపై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రశంసల సునామీని కురిపించాడు. కోహ్లీని అసాధారణ వ్యక్తిగా అభివర్ణించాడు. కోహ్లీ- ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికే ఇష్టపడతాడని వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థి సవాల్‌ను అతను ఎప్పుడూ స్వీకరిస్తుంటాడని పేర్కొన్నాడు. కింగ్ ఆఫ్ ఛేజింగ్.. మాస్టర్ ఆఫ్ ఛేజింగ్‌గా కితాబిచ్చాడు. కోహ్లీ మనస్తత్వానికి అతని బ్యాటింగ్ తీరే అద్దం పడుతుంటుందని చెప్పాడు.

బుల్లెట్‌కైనా ఎదురెళ్తా గానీ..
తాను క్రీజ్‌లో ఉన్నంత సేపు విరాట్ కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ కానివ్వబోనని హార్దిక్ పాండ్యా చెప్పాడు. బుల్లెట్‌కైనా ఎదురెళ్తాను గానీ.. కోహ్లీని మాత్రం కాపాడుకుంటానని పేర్కొన్నాడు. కీలకమైన గేమ్‌లల్లో ఒత్తిడిని ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ కంటే గొప్పవారెవరూ లేరని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ కావాలని తామిద్దరం కోరుకోలేదని చివరి మూడు ఓవర్లల్లో 40 పరుగులు అవసరమైనప్పుడు కూడా ఒత్తిడికి గురి కాకూడదని నిర్ణయించుకున్నామని వ్యాఖ్యానించాడు.

నమ్మకం వమ్ము కాలేదు..
తాను చాలా సిక్సర్లు కొట్టానని, విరాట్ కోహ్లీ సిక్సర్లు మాత్రం ప్రత్యేకమైనవని హార్దిక్ పాండ్యా చెప్పాడు. తన హృదయంలో చిరస్మరణీయంగా ఉండిపోతాయని పేర్కొన్నాడు. చివరి ఓవర్ తొలి బంతికి అవుట్ అయిన తరువాత కొన్ని నిమిషాల పాటు తనకేమీ అర్థం కాలేదని, ఆ షాట్ ఎలా ఆడానో పునఃసమీక్షించుకున్నానని వ్యాఖ్యానించాడు. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ ఉన్నాడనే ధైర్యంతో తాను పెవిలియన్ చేరుకున్నానని చెప్పాడు. తన నమ్మకం వమ్ము కాలేదని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
