టెస్టుల్లో టీమిండియా అత్యంత కఠిన సవాళ్లను అధిగమించి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాల్లో విజయకేతనం ఎగురవేసింది. కానీ దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు ఒక్కసారి టెస్టు సిరీస్ ను సాధించలేకపోయింది. సఫారీ గడ్డపై ఇప్పటివరకు టీమిండియా ఎనిమిది టెస్టు సిరీస్ లు ఆడింది. 2010-11లో ధోనీ కెప్టెన్సీలో సిరీస్ ను 1-1తో డ్రా గా ముగించడమే దక్షిణాఫ్రికాలో భారత్ కు అత్యుత్తమ ప్రదర్శన.
సుదీర్ఘ ఫార్మాట్ లో సఫారీ గడ్డపై ఈ సారి గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే దక్షిణాఫ్రికాపై విజయం సాధించాలంటే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి టీమిండియాకు ఆయుధమని మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి రాణిస్తే భారత్ కు విజయావకాశాలు ఉంటాయని అన్నాడు.

''ప్రపంచంలో ఎక్కడైనా సరే.. విరాట్ కోహ్లి గొప్ప ప్లేయర్. సఫారీ గడ్డపై ఆడిన అనుభవం అతడి సొంతం. ఈ అనుభవాన్ని సహచర, యువ ఆటగాళ్లకు పంచుతూ ఇక్కడ పరిస్థితులను వారు అర్థం చేసుకునేలా తన ఆలోచనలను కోహ్లి అందిస్తాడు. ఈ సిరీస్ లో కోహ్లి అద్భుత ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. భారత్ విజయం సాధిండంలో కీలక పాత్ర పోషిస్తాడు. సఫారీ గడ్డపై టీమిండియా విజయం సాధించాలంటే కోహ్లి గొప్పగా ఆడాల్సి ఉంది'' అని కలిస్ పేర్కొన్నాడు.
సౌతాఫ్రికాలో టెస్టుల్లో కోహ్లికి మంచి రికార్డు ఉంది. విరాట్ సఫారీ గడ్డపై ఆడిన 14 ఇన్నింగ్స్ ల్లో 51.36 సగటుతో 719 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అంతేగాక ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కోహ్లి సూపర్ ఫామ్ తో పరుగులు సాధించాడు. 11 మ్యాచ్ ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. మూడు శతకాలు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ను అందుకున్నాడు. కాగా, డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్టు ప్రారంభం కానుంది.