టీ20 ప్రపంచకప్ భారత జట్టు నుంచి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న కథనాలు తీవ్రచర్చలకు దారితీస్తున్నాయి. తాజాగా 1983 ప్రపంచకప్ విన్నింగ్ టీమ్ ఆల్‌రౌండర్ కిర్తి ఆజాద్ ఈ వార్తలపై స్పందించాడు. అంతేగాక బీసీసీఐ సెక్రటరీ జై షాపై పరోక్షంగా ఘూటు విమర్శలు చేశాడు. భారత జట్టు ఎంపికలో జై షా ఎందుకు ఉంటున్నాడని, ఎంపిక ప్రక్రియలో అవివేకి స్థానం కల్పించకూడదని ఆజాద్ పేర్కొన్నాడు.
కోహ్లికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అండగా ఉన్నాడని కిర్తీ ఆజాద్ ట్వీట్ చేశాడు. ''టీ20 ప్రపంచకప్ జట్టులో విరాట్ కోహ్లి నుంచి తప్పించడానికి మిగిలిన సెలకర్లును ఒప్పించాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు జై షా బాధ్యతలు అప్పగించారంటున్నారు. జై షా ఎందుకు చేయాలి? అతను సెలక్టర్ కూడా కాదు. అంతేగాక ఈ పనిని పూర్తిచేయడానికి మార్చి 15 తేదీ వరకు గడువు కూడా ఇచ్చారంటున్నారు''.

''విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ విషయంలో అజిత్ అగార్కర్ ఇతరులను ఒప్పించలేకపోయాడు. తనకి తాను కూడా సర్దిచెప్పుకోలేకపోయాడు. మరోవైపు రోహిత్ శర్మను కూడా జై షా సంప్రదించాడు. కానీ ఎట్టిపరిస్థితుల్లో విరాట్ కోహ్లి జట్టుతో ఉండాలని రోహిత్ తేల్చిచెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లి బరిలోకి దిగుతాడు. జట్టు ఎంపిక కంటే ముందే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. అవివేకులు జట్టు ఎంపిక ప్రక్రియలో ఉండకూడదు'' అని కిర్తి అజాద్ ట్వీట్ చేశాడు.
మరోవైపు కిర్తి అజాద్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తుంది. టీమిండియా ఎంపిక గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా తరుచూ ఎందుకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడని? బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కంటే జై షానే అన్నింట్లో ఎక్కువగా భాగమవ్వడం, అతిగా ఎందుకు స్పందిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెలక్టర్లు బాధ్యతల్లో ఎవరూ తలదూర్చకూడని అంటున్నారు. మరోవైపు వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు చేయడం సరికాదని కిర్తి అజాద్ గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు.

జూన్‌లో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలో, సూపర్-8, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో జరగనున్నాయి. అయితే వెస్టిండీస్ స్లో పిచ్‌లపై విరాట్ కోహ్లి టీమిండియాకు భారమవుతాడని, కోహ్లి స్థానంలో యువ హిట్టర్లకు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారని వార్తలు వచ్చాయి.