హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పోల్చడం సరైంది కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ కాస్ప్రొవిజ్ అన్నాడు. అయితే సచిన్ టెండూల్కర్ ఎప్పటికీ ఒక్కడేనని, అతడి స్ధానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పుకొచ్చాడు.
న్యూఢిల్లీలో ఫిక్కీ, క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైకెల్ కాస్ప్రొవిజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌లపై మీడియా అడిగిన ప్రశ్నలకు గాను స్పందించాడు. సచిన్ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు.
అలాంటి సచిన్‌తో కోహ్లీని పోల్చడం సరికాదని మైకెల్ తెలిపాడు. రెండు దశాబ్దాల క్రితం షార్జాలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా విజయం ఎలా సాధించిందో చెప్పుకొచ్చాడు.

'ఇందుకు కారణం సచిన్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 272 పరుగులు చేసింది. నిజానికి ఆ స్కోరు భారత్‌కు సవాల్‌తో కూడుకున్నదే. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తడబడింది. గంగూలీ వికెట్ కూడా కోల్పోడంతో మ్యాచ్ ఇక మా సొంతం అనుకున్నాం. కానీ సచిన్ మాకు విజయాన్ని దూరం చేశారు' అని పేర్కొన్నాడు.
'కీలక సమయంలో 134 పరుగులతో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ సమయంలో సచిన్ స్థానంలో కోహ్లీ ఉంటే అలా ఆడగలిగేవాడో లేదో? ఎప్పటికీ సచిన్ టెండూల్కర్ ఒక్కడే. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు' అని అన్నాడు.
ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా జట్టుని ముందుండి నడిపిస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు. ఇదిలా ఉంటే శనివారం నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరిస్‌పై కూడా మైకెల్ కాస్ప్రొవిజ్ మాట్లాడాడు.
'ప్రస్తుతం భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆసీస్ విజయం సాధిస్తోందని భావిస్తున్నా. ఎందుకంటే స్మిత్, వార్నర్, మ్యాక్స్‌వెల్, అరోన్ ఫించ్‌కి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది' అని మైకెల్ తెలిపాడు. ఆసీస్ తరుపున మైకెల్ కాస్ప్రొవిజ్ 38 టెస్టులు, 43 వన్డేలాడాడు.