దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిపై స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియాకు ప్రస్తుతం కోహ్లి కెప్టెన్ కానప్పటికీ ఎప్పటికీ నాయకుడే అని అన్నాడు. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గురించి బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
విరాట్ కోహ్లి ఎనర్జీ లెవల్ అందరి కంటే భిన్నంగా ఉంటుందని, దాన్ని ఎవరూ అందుకోలేరని బుమ్రా అన్నాడు. ఎంతో ఉద్వేగంతో బరిలోకి దిగుతాడని, ప్రదర్శన చేస్తాడని తెలిపాడు. ఫిట్‌నెస్ రూపంలో, ఇతరత్రా విషయాల్లో కోహ్లి ప్రేరణగా నిలుస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం విరాట్ కెప్టెన్ కానప్పటికీ, ఇప్పటికీ అతను నాయకుడే అని బుమ్రా అన్నాడు.

ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని బుమ్రా తెలిపాడు. కెప్టెన్‌గా రోహిత్ ఎదిగిన తీరు, అందరి అభిప్రాయాల నుంచి అతను తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయని అన్నాడు. ''రోహిత్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అతను కెప్టెన్‌గా ఎలా ఎదిగాడు, తప్పులను అతను సరిదిద్దుకోవడం, అభిప్రాయాలను స్వీకరించడం వంటి విషయాలు చక్కగా ఉంటాయి. అందరి మాటలను అతను వింటాడు. వాటిని ఫిల్టర్ చేసి సరైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. అతని కెప్టెన్సీలో ఎంతో కాలంగా ఆడుతున్నందుకు గొప్పగా ఉంది'' అని బుమ్రా పేర్కొన్నాడు.
ఇక తాను తీసిన ఫేవరేట్ వికెట్.. విరాట్ కోహ్లిని ఔట్ చేయడమని బుమ్రా తెలిపాడు. 2013లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన బుమ్రా తొలి వికెట్‌గా కోహ్లిని ఔట్ చేశాడు. కోహ్లిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా కొద్దికాలంలోనే స్టార్ పేసర్‌గా ఎదిగాడు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో విలువైన ప్లేయర్‌గా నిలిచాడు. కాగా, శ్రీలంక పర్యటనకు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.