స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డును కోహ్లి బద్దలు కొడతాడని, కోహ్లికి అసాధ్యమనేది లేనే లేదని క్లైవ్ అన్నాడు. కోల్‌కతాకు వచ్చిన క్లైవ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
''సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లికి ఎంత సమయం పడుతుందో తెలియదు. కానీ కోహ్లికి ఇంకా వయసు ఉంది. అతడు సాధించాలనుకునే రికార్డులన్నీ సాధించగలడు. అతడు సాధిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం క్రికెటర్లందరూ ఎక్కువగా టీ20లే ఆడుతున్నారు. టెస్టు క్రికెట్ చాలా తక్కువగా ఆడుతున్నారు. ఒక వేళ టెస్టు ఫార్మాట్ ఆడితే మూడు లేదా అయిదు టెస్టు మ్యాచ్‌లు ఆడాలని సూచిస్తున్నాను'' క్లైవ్ లాయిడ్ అన్నాడు.

ఇటీవల భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు సిరీస్ రెండు మ్యాచ్‌లు అనే విషయం తెలిసిందే. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు వివాదాస్పదంగా మారింది. న్యూలాండ్స్ పిచ్ సంతృప్తిగా లేదంటూ ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. అయితే కేప్ టౌన్ పిచ్ గురించి లాయిడ్ మాట్లాడుతూ.. పిచ్ బాగానే ఉందని, దానికి తగ్గట్టుగా ఆటగాళ్లు స్పందించలేదని పేర్కొన్నాడు. టాప్ క్లాస్ క్రికెట్ ఆడాలంటే భిన్నమైన పిచ్ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం జట్లకు ఉండాలని అన్నాడు.
టీ20 క్రికెట్ ఎగ్జిబిషన్ అని, కానీ టెస్టు క్రికెట్ ఎగ్జామినేషన్ వంటిదని సుదీర్ఘ ఫార్మాట్ గొప్పతనం గురించి లాయిడ్ పేర్కొన్నాడు. ''మన యువ ఆటగాళ్లందరూ గ్రౌండ్ అవతలకు భారీ షాట్లు ఆడాలని చూస్తున్నారు. అలా చేసి ఫ్రాంచైజీ క్రికెట్ కాంట్రాక్ట్ కోసం ఆశిస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు'' అని అన్నాడు.
ప్రస్తుత భారత జట్టు పటిష్టంగా ఉందని క్లైవ్ లాయిడ్ కొనియాడాడు. స్ట్రాంగ్ స్పిన్నర్లు, పేసర్లు, అద్భుత బ్యాటర్లతో సమతూకంగా ఉందని తెలిపాడు. గొప్ప ప్రదర్శనలు చేస్తుందని మెచ్చుకున్నాడు. కాగా, ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. మొహాలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.