భారత టెస్ట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల కారణంగా రాణించలేకపోతున్నాడు. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో కూడా రోహిత్ ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ పేలవంగా ఆడుతున్నాడు. హిత్ 15 ఇన్నింగ్స్‌లలో కేవలం 10.93 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో కేవలం 31 పరుగులే చేశాడు. ఒకసారి మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు.
దీంతో అతను టెస్ట్ జట్టు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే రిటైర్మెంట్ ప్రకటించాలంటున్నారు. భారత్ ప్రస్తుత సిరీస్ లో వెనకంజలో ఉంది. ఆస్ట్రేలియా2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. సిడ్నీలో జరిగే ఐదో టెస్ట్ లో భారత్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చివరి టెస్ట్ లో రోహిత్ ఆడతాడా లేదా అనేది కూడా సందేహంగానే మారింది.

చివరి టెస్ట్ లో రోహిత్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకుంటారా లేదా అని ధృవీకరించడానికి కోచ్ గౌతమ్ గంభీర్ నిరాకరించాడు. పిచ్ ను పరిశీలించి తుది జట్టును ప్రకటిస్తామని చెప్పాడు. దీంతో రోహిత్ ఆడడంపై సందిగ్ధత నెలకొంది. ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత రోహిత్ భారత టెస్ట్ జట్టు కెపెన్సీని వదులుకునే అవకాశం ఉంది. అలా అని వెంటనే రిటైర్మెంట్ ప్రకటించకపోవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇప్పటికే జట్టులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింతగా పెంచకుండా ఉండేందుకు రోహిత్ అలాంటి నిర్ణయాన్ని విరమించుకోవచ్చని తెలుస్తోంది. రోహిత్ వెంటనే రిటైర్మెంట్ తీసుకుంటే జట్టును అనిశ్చితి స్థితిలోకి నెట్టివేస్తుందన భావిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే విరాట్ కోహ్లీ నాయకత్వ పాత్రలో తిరిగి అడుగు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కోహ్లీ కూడా భయంకరమైన ఫామ్ లో ఏమి లేడు.